Butterfly Park
-
Mulapadu Butterfly Park Photos: ఇంతందంగా ఉన్నావే..ఎవరే నువ్వు? (ఫొటోలు)
-
Butterfly Park: కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌కు మణిమకుటం
వర్షాకాలం వచ్చిందంటే వాన జల్లులు, పిల్లకాలువల పరవళ్లతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తుంది. అలాగే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఎగిరే పూలు.. అదేనండీ సీతాకోక చిలుకలు వర్ణాల మేళవింపుతో కనువిందు చేస్తాయి. వీటిని చూసి ఆనందపడని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక సీతాకోక చిలుకను కనిపిస్తేనే తదేకంగా చూస్తూ ఉండిపోతాం.. అలాంటిది వందల సంఖ్యలో పలు రకాల సీతాకోక చిలుకలు రెక్కలు విప్పుతూ మన చుట్టూ తిరుగుతుంటే.. ఆ అనుభవం వర్ణనాతీతం. ఈ అద్భుతం కృష్ణా జిల్లాలో త్వరలోనే ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో సీతాకోకచిలుకల పార్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిగామ: కృష్ణా జిల్లాలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ దాదాపు 24 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో పలు రకాల వన్య ప్రాణులు జీవిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని మూలపాడు వద్ద 63 రకాల సీతాకోక చిలుక జాతులున్నట్లు గుర్తించిన అటవీ శాఖాధికారులు వీటి పరిరక్షణ, పునరుత్పత్తిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ ప్రాంతానికే మణిహారంగా నిలిచేలా సీతాకోక చిలుకల పార్క్ అభివృద్ధికి సర్కారు పూనుకుంది. కేవలం సీతాకోక చిలుకల జాతిని పరిరక్షించడమే కాకుండా పెద్ద పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అడుగడుగునా ఆకట్టుకునేలా...! 65వ నంబరు జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామం వద్ద నుంచి మూడు కిలోమీటర్లు లోపలకు వెళ్తే.. ఈ పార్క్‌ను చేరుకోవచ్చు. పార్క్‌కు వెళ్లే దారి ప్రారంభం నుంచి పార్క్ గేట్ వరకు సీతాకోక చిలుకల్లోని రకాలు, వాటి ప్రాముఖ్యతలు, ప్రకృతికి అవి చేసే మేలు, వాటి జాతులు... ఇలా అన్ని వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ ద్వారాన్ని తీర్చి దిద్దిన తీరు అమోఘం అని చెప్పక తప్పదు. అదేవిధంగా చిన్నారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సీతాకోక చిలుకల ఆకారంలోనే ఏర్పాటుచేసిన బల్లలు కూడా ఎంతో అందంగా కన్పిస్తాయి. చివరకు గార్డెనింగ్ కూడా సీతాకోక చిలుక ఆకారంలోనే ఏర్పాటుచేయడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సీతాకోక చిలుకల పరిరక్షణే ధ్యేయం.. ఈ ప్రాంతంలో ఉన్న 63 రకాల సీతాకోక చిలుకలను పరిరక్షించడమే ధ్యేయంగా అటవీ శాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా అవి ఎక్కువగా ఇష్టపడి మకరందాన్ని గ్రోలే పుష్ప జాతులను పెంచుతున్నారు. జూలై నుంచి అక్టోబర్ మాసాల్లో వర్షా కాలం సీజన్లో వీటి పునరుత్పత్తి జరుగుతుంది. అప్పటికి పార్క్‌ను సిద్ధం చేయాలని అటవీ శాఖాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అతి పెద్ద సీతాకోక చిలుకల పార్క్‌గా ఇది నిలుస్తుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అదనపు ఆకర్షణగా ట్రెకింగ్.. ప్రస్తుతం ట్రెకింగ్‌కు మంచి క్రేజ్ ఉంది. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు చాలా మంది దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీతాకోక చిలుక పార్క్‌కు సమీపంలోనే ట్రెకింగ్ కూడా ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. మొత్తానికి అతి త్వరలోనే జిల్లా వాసులకు ఓ మంచి ఆహ్లాదకరమైన, రమణీయమైన పార్క్ అందుబాటులోకి రానుంది. జూ పార్క్ ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ఎంతో అందమైన ప్రాంతం. అందులో సీతాకోక చిలుకల పార్క్ ఏర్పాటుచేయడం ద్వారా మరింత శోభ సమకూరనుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో సీతాకోక చిలుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. అటువంటి వాటిని పరిరక్షించుకోవడంతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం ఈ పార్క్ ఉపయోగపడుతుంది. దీనికి అదనంగా మినీ జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు సైతం ప్రయత్నిస్తున్నాం. – బి.లెనిన్కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, కొండపల్లి సెక్షన్ -
సుమారు 155 రకాల సీతాకోక చిలకలు
బహదూర్‌పురా: ప్రకృతి రమణీయతను సీతాకోక చిలకలు ద్విగుణీకృతం చేస్తున్నాయి. జూ సందర్శకులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులోని బటర్‌ఫ్లై పార్కు అమితంగా ఆకర్షిస్తోంది. ఇటీవల పునర్నిర్మాణంతో అందుబాటులోకి వచ్చిన ఓపెన్ బటర్‌ఫ్లై పార్కులో ఎన్నో రకాల సీతాకోక చిలుకలు సందర్శకులను అలరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 వేల సీతాకోక చిలకలలో భారతదేశంలో 1,500 రకాలు ఉన్నాయి. ఇందులో 155కుపైగా వివిధ రకాల సీతాకోక చిలకల్ని హైదరాబాద్ జూపార్కులో చూడవచ్చు. పార్కు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల చెట్లు ఉన్నాయి. సీతాకోక చిలకల కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల చెట్లను ఈ పార్కులో నాటారు. దీంతో సీతాకోక చిలకల పార్కు సందర్శకుల మదిని దోచుకుంటోంది. ముఖద్వారం..నయనానందకరం సీతాకోక చిలకల పార్కు ముఖద్వారాన్ని వివిధ రంగులతో తీర్చిదిద్దారు. బయట గేటుతో పాటు లోపల పచ్చిక బయలు, వివిధ రకాల సువాసనతో కూడిన పూల మొక్కలతో పార్కు ప్రదేశమంతా ఆహ్లాదకరంగా ఉంది. సందర్శకులకు మానసికోల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తోంది. కీటకాల మ్యూజియం.. వివిధ రకాల క్రిమికీటకాల మ్యూజియం కూడా ఓపెన్ బటర్‌ఫ్లై పార్కులో ఏర్పాటు చేశారు. క్రిమికీటకాలు ప్రారంభ దశ నుంచి మార్పు చెందే విధానాన్ని వివరించే బోర్డు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఎన్నో రకాల క్రిమికీటకాల గురించి తెలుసుకునేందుకు ఈ మ్యూజియం ఒక విశ్వవిద్యాలయమేనని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇంటిల్లిపాదీ బటర్‌ఫ్లై పార్కును సందర్శించి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి. -
ఆశీర్వాదం.. అమ్మతో కలిసి భోజనం
గాంధీనగర్: దేశానికి రాజైనా.. తల్లికి మాత్రం బిడ్డే. ఈ సామెత ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో అక్షర సత్యం అనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఊపిరి సలపని బాధ్యతలతో బిజీగా ఉండే మోదీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తప్పకుండా తల్లి హీరాబెన్‌ను కలుస్తారు. అలానే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి సమక్షంలో కాసేపు గడిపారు మోదీ. ప్రస్తుతం మోదీ తల్లి హీరాబెన్.. గాంధీనగర్‌కు సమీపంలోని రైసిన్ గ్రామంలో చిన్నకుమారుడైన పంకజ్ మోదీ దగ్గర ఉంటున్నారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా మోదీ మంగళవారం తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని.. ఆమెతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అనంతరం తల్లితో, చుట్టుక్కల వారితో కాసేపు ముచ్చటించారు మోదీ. కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హీరాబెన్ మోదీకి 501 రూపాయలను బహుమతిగా ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత మోదీ తొలుత తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రే గుజరాత్ చేరుకున్న మోదీ నేడు పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్‌ను, వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో కలిసి నమామి నర్మద మహోత్సవాన్ని ప్రారంభించారు. అలానే సర్దార్ సరోవర్ డ్యామ్‌కు సమీపంలోని బటర్‌ఫ్లై పార్క్‌ను కూడా సందర్శించారు మోదీ. ఈ క్రమంలో ఓ బ్యాగులో తీసుకువచ్చిన సీతాకోక చిలుకలను బయటకు వదిలి పెట్టారు మోదీ. -
సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?
సాక్షి సిటీబ్యూరో: హరివిల్లులోని రంగులన్నీ తన రెక్కల్లో నింపుకుని నిశబ్దంగా ఎగురుతుంటాయి. ప్రకృతిలోని అందాలన్నీ తనలోనే ఇముడ్చుకుని పూలమొక్కల్లో కలియదిరుగుతుంటాయి. అవే రిగే సీతాకోకచిలుకలు.. పిల్లలకు అవంటే ఎంత ఇష్టమో.. పెద్దలకూ అంతే ఇష్టం. పూలలో పువ్వుల్లా కలిసిపోయే ఆ అందమైన చిరుజీవుల కోసం మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కులో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై పార్కు వెలవెలబోతోంది. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఇవి జీవవైవిధ్యంలో కూడ ఎంతో కీలకమైనవి. వాతావరణంలో ఏర్పాడుతున్న మార్పుల వల్ల ఆ జాతి తగ్గిపోతుండగా.. మరోవైపు అటవీశాఖ ఆధ్వర్యంలో పలు చోట్ల సీతాకోకచిలుకల కోసం ప్రత్యేకంగా వనాలు, పార్కులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో అందమైన సీతాకోకచిలుకలు కనిపించడం లేదు. నగర శివారులోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో సీతాకోకచిలుకల వనాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ రంగు రంగు రెక్కల సీతాకోక చిలుకలను చుద్దామని వస్తున్న పర్యాటకులకు నిరాశే ఎదురువుతోంది. అటవీశాఖ అధికారుల సరైన నిర్వాహణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ సీతాకోకచిలుకల వనంలో ఆ జాతి కనిపించడం లేదు. బటర్‌ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ హైదరాబాద్ లెక్కల ప్రకారం తెలంగాణలో 170 రకాలు, బయోడైవర్సిటీ బోర్డు లెక్కల ప్రకారం 153 రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడోచోట ఒకటీ రెండూ తప్ప కనువిందు చేసే సంఖ్యలు లేవు. మొదట్లో బాగానే ఉన్నా.. నగర శివార్లలోని విజయవాడ జాతీయ రహదారిపై 1404 హెక్టార్లలో మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు విస్తరించి ఉంది. ఇందులో కృష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, పలు రకాల పాములు, పక్షులు ఉన్నాయి. ప్రతిరోజు ఈ పార్కుకు వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అదేవిధంగా నగరంలోని పలు పాటశాలల విద్యార్థులను స్టడీ టూర్లో భాగంగా తీసుకువస్తుంటారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం పార్కులోని కొంత స్థలాన్ని ప్రత్యేక సీతాకోకచిలుకల వనంగా తీర్చిదిద్దారు. నిత్యం పూలతో కళకళలాడే విధంగా.. చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు నిర్వాహణ బాగుండడంతో వందల సంఖ్యలో సీతాకోకచిలుకలు అభివృద్ధి చెంది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేవి. రానురాను అధికారులు ఈ బటర్‌ఫ్లై పార్కును పట్టించుకోకపోవడంతో పూల మొక్కల స్థానంలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దాంతో సీతాకోకచిలుకలు సైతం కనిపించకుండా పోయాయి. మొక్కలు పెంచుతాం సీతాకోకచిలుకలు తగ్గిన విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. వెంటనే దీనిపై చర్యలు తీసుకుని బటర్‌ఫ్లై పార్కును అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా సీతాకోకచిలుకలకు ప్రధానమైన పూల మొక్కలను పెంచుతాం. – శివయ్య, డీఎఫ్ఓ సీతాకోకచిలుక జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అందరూ అసహ్యించుకునే గొంగళిపురుగు ఎంతో శ్రమకోర్చి తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ క్రమంలో అది మరో జన్మే ఎత్తుతుంది. కొన్నిరోజులు గొంగళిపురుగుగానే పెరిగి.. తర్వాత తన లాలాజలంతో తనచుట్టూ చీకటి గూడుకట్టుకుని అందులోనే ఉండిపోయి రెక్కలు తొడిగి తన పాత దేహాన్ని వదిలి అందరూ ఇష్టపడే అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. ఈ రూపంలో కొన్ని గంటలు మాత్రమే ఈ ప్రాణి జీవించి అనంతరం ప్రాణాలు విడుస్తుంది. కానీ బతికి ఆ కొన్ని గంటలు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. మహవీర్ హరిణ వనస్థలిలో ఏర్పాటు చేసిన సీతాకోకచిలుకల వనంలో పూల మొక్కలు లేక వాటి ఉనికే ప్రశ్నార్థకమైంది. -
అరకు రైలుకు అద్దాల బోగీలు
► హెరిటేజ్ సిటీగా భీమిలి ► పాడేరులో బటర్‌ఫ్లై పార్కు ► మే రెండో వారంలో అరకు ఉత్సవ్ ► ఆర్ట్ గ్యాలరీగా మార నున్న రాజీవ్ స్మృతి భవన్ ► పర్యాటక ప్రాధాన్యంపై మంత్రి గంటా సమీక్ష విశాఖపట్నం సిటీః విశాఖను పర్యాటక అందాల రాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా వసతుల కల్పనపై దృష్టి సారించింది. ప్రస్తుతమున్న పర్యాటక ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త ప్రాజెక్టులను ఎక్కడెక్కడ చేపట్టాలనే దానిపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక అధికారులతో శుక్రవారం వుడా కార్యాలయంలో సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, టూరిజంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బినయ్‌కుమార్ ప్రసాద్, వుడా వైస్ చైర్మన్ డాక్టర్ బాబూరావు నాయుడు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జే నివాస్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరినారాయణన్, వివిధ శాఖల ముఖ్య ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మే నెల రెండో వారంలో అరకు ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించాలని అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని నిర్ణయించారు. సింహాచలం కొండపై రోప్‌వే ఏర్పాటు చేసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలని అందుకు అభ్యంతరాలపై దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కొండపై స్టార్ హోటల్ స్థాయిలో కాటేజీలు నిర్మించి భక్తులు, పర్యాటకులు రాత్రి వేళల్లోనూ బస సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించవచ్చని గుర్తించారు. సముద్రంలో రెండు మూడు రోజుల పాటు విహరిస్తూ ఆనందంగా గడపడానికి అవసరమైన క్రూయిజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటివాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరకు ప్రాంతానికి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు ప్రస్తుతం నడుస్తున్న 1వీకే ప్యాసింజర్‌కు రెండు అద్దాల బోగీలను జత చేసే ప్రయత్నం పై మళ్లీ కదలిక తెచ్చారు. ఈ సారి ఎలాగైనా రెండు బోగీలను జత చేసేలా ప్రయత్నించాలని మంత్రి గంటా అధికారులను ఆదే శించారు. భీమిలి పట్టణాన్ని హెరిటేజ్ ప్రాంతంగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హనుమంతవాక వద్ద నిర్మాణమైన విమ్స్‌కు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. మరో రూ. 30 కోట్లు కేటాయిస్తే ఓ 200 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించవచ్చని సమావేశంలో చెప్పుకున్నారు. అయితే టాటా కేన్సర్ ప్రాజెక్టు వారు ఈ ఆస్పత్రిని కేటాయించాలని కోరుతున్నారని అందుకే ఎటూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటా తేల్చిచెప్పారు.