పూతై రాలును ప్రేమ
మాధవ్ శింగరాజు
చిలుక.. మన్మథుడి వాహనం. చిలక పలుకు.. మగవాడి మంత్రదండం.
పూలు.. మన్మథుడి బాణాలు. పురుషులు.. పూలతో మోకరిల్లే పుంగవులు!
అమ్మాయిలూ విన్నారా.. ఇవాళ్టి నుంచి ఇది శ్రీ మన్మథనామ సంవత్సరం. కాస్త జాగ్రత్త. ప్రేమ ఎక్కడి నుంచి ఊడిపడుతుందో దేవుడైనా చెప్పలేడు. బ్రహ్మదేవుడికే గుబులు పుట్టించినవాడు, పరమశివుడినీ వివశుణ్ణి చేసినవాడు.. మన్మథుడు! అతి ప్రమాదకారి. పొదిలో ఎప్పుడూ పంచశరాలు ఉంటాయి. అరవిందం, అశోకపుష్పం, నీలోత్పలం, మల్లె, మావిపూత. వాటితో పడగొడతాడు.
దేవతలందర్లోకీ మన్మథుడు మహా ఎఫెక్టివ్ అంటోంది రుగ్వేదం. ఎంత ఎఫెక్టివ్వో మత్స్యపురాణంలో ఉంది. ఉగాది నాడు బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు, ఆయన చేతుల మీదుగా ‘శతరూప’ అనే అతిలోక సుందరి కూడా పుట్టుకొస్తుంది. ఆ సౌందర్యరాశిని చూడగానే అంతపెద్ద బ్రహ్మకూ మతిపోతుంది. కళ్లు తిప్పకుండా ఆమె వెనకెనకే తిరుగుతాడు. ‘నా ప్రేమను కోపంగానో.. నా ప్రేమను ద్వేషంగానో.. చెలియా ఫీల్ మై లవ్’ అంటూ ఆమె చుట్టూ చక్కర్లు కొడతాడు. అంతటితో తృప్తి చెందడు. ఆమెను ఏ దిక్కు నుంచీ మిస్ కాకూడదనుకుని నాలుగు తలలు సృష్టించుకుంటాడు. అదీ తృప్తినివ్వదు. ‘శతరూప’ గగన విహారం చేస్తుంటే ఆమెను చూసేదెలా అని సందేహపడి, పైన ఐదో శిరస్సును ఏర్పాటు చేసుకుంటాడు. బ్రహ్మగారి తీరు శివుడికి పట్టలేనంత కోపాన్ని తెప్పిస్తుంది. ఆగ్రహంతో ఆ ఐదో తల నరికేస్తాడు. అప్పటికి గానీ బ్రహ్మ తన లోకంలోకి తను తిరిగి వచ్చేయడు. పశ్చాత్తాపం చెంది, తన బుద్ధిని పెడదారి పట్టించిన మన్మథుడిని అశరీరుణ్ణి చేసేస్తాడు. ‘అశరీరుడు’ అంటే శరీరం లేనివాడు.
శివపురాణంలోనూ ఇలాంటి కథే ఉంది. అందులో బాధితుడు స్వయానా పరమేశ్వరుడు! ఇంద్రుణ్ణి, తక్కిన దేవత ల్ని తారకాసురుడు అనే రాక్షసుడు టార్చర్ పెడుతుంటాడు. శివుడి కుమారుడు తప్ప అతణ్ని ఎవరూ సంహరించలేరని బ్రహ్మ అతడికి ఆల్రెడీ ఓ వరం ఇచ్చి ఉంటాడు కాబట్టి తారకాసురుడు పేట్రేగిపోతుంటాడు. అప్పటికింకా శివుడు బ్రహ్మచారే. పైగా తపస్సులో ఉంటాడు. ఎలా? బ్రహ్మ ఆలోచిస్తాడు. ఆ తపస్సును భంగపరిచి, శివుడి బ్రహ్మచర్యాన్ని భగ్నం చేయడానికి మన్మథుణ్ణి పురమాయిస్తాడు. మన్మథుడు ఉత్సాహంగా వెళ్లి, వింటినారిని సాగదీసి ఓ పూలబాణం శివుడిపైకి సంధిస్తాడు. శివుడు లిప్తకాలం తడబడి, తమాయించుకుని మూడో కన్ను తెరిచి మన్మథుణ్ని భస్మం చేసేస్తాడు. మన్మథుడి భార్య రతీదేవి వెళ్లి తన భర్తను బతికించమని శివుణ్ణి వేడుకుంటుంది. శివుడు అతడిని బతికిస్తాడు. కానీ అనంగుడిని చేస్తాడు. ‘అనంగుడు’ అంటే అంగాలు లేనివాడు.
అశరీరుడే అయినా, అనంగుడే అయినా, నేటికీ మన్మథుడు తలచుకుంటే ఏ మలుపులోనో మీ తలపై ప్రేమ వేపపూతై రాలిపడొచ్చు. పుస్తకాల్లోకి తల దూర్చేసి ధ్యానముద్రలో ఉన్నప్పుడు ఏ గండు కోయిల ప్రేమ రాగమో కిటికీలోంచి మీ చెవులకు సోకవచ్చు. పగలు విన్న తియ్యని మాటలకు రాత్రి నిద్రలో మీ పెదవులు విచ్చుకోవచ్చు. ఉప్పూకారం చల్లిన పుల్లని మామిడి పిందెల కబుర్లు మీ మన సును గిల్లి, గిలిగింతలు పెట్టవచ్చు.
మన్మథుడు గొప్ప అని కాదు. మన బాయ్స్ మన్మథుడినే బ్యాడ్బాయ్గా మార్చగల గొప్ప ప్రావీణ్యులు. అందుకే అమ్మాయిలూ... కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ పూతలకు పరవశించకండి. ప్రేమరాగాలకు శ్రుతి తప్పకండి. ప్రియభాషణల ప్రేమబాణాలకు హృదయాన్ని పరవకండి. ప్రేమకబుర్ల గుబుర్ల మాటున సిలబస్లో లేని సబ్జెక్టులను నేర్చుకోకండి. కష్టమే. కానీ, తర్వాత వచ్చే కష్టాలకంటేనా!!
ఈ మన్మథనామ సంవత్సరం మీకు మనశ్శాంతిగా, నిశ్చింతగా గడవాలి.