సార్వత్రిక ఎన్నికల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల గణనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ గురువారం కలెక్టర్, ఎస్పీలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు కేంద్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటికి పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఈవీఎం వద్ద మైక్రో అబ్జర్వర్‌తో పాటు వీడియో నిఘా మధ్య ఓట్ల గణన జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఓట్లు లెక్కింపు జరిగే ఎంఎన్ఆర్, గీతం, డీవీఆర్ కాలేజ్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ తెలిపారు. ఈ కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎస్పీలు, ఒక ఓఎస్డీ, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 90 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 9 స్పెషల్ పార్టీ పోలీసులు, 150 మంది పోలీసు సిబ్బందిని నియమించామని ఆమె వివరించారు.