హైవేపై ప్రమాదమా? కాల్ 1033!
జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో ఏటా వేలాదిమంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాలను నివారించే దిశగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అడుగులేస్తోంది. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా దేశంలోని హైవేలన్నింటిపై అంబులెన్సుల ఏర్పాటుకు ఉపక్రమించింది. దేశంలోని పలు ప్రధాన రహదారులపై ఈ సేవందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ రహదృరులపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులవుతూ.. చనిపోతున్న వారి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సుల ఏర్పాటుకు సిద్ధమైంది. కేవలం హైవేలపై జరిగే ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆదుకునేందుకు 1033 నంబరు అంబులెన్స్‌ను కేటాయించింది. వీటి ఏర్పాటుకు దేశంలోనే అత్యంత రద్దీ గల జాతీయ రహదారులను పెలైట్ ప్రాజెక్టులుగా ఎంపికచేసింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 60 కిలోమీటర్లకు ఒక అంబులెన్సు చొప్పున 270 కిలోమీటర్ల పరిధిలో ఐదు అంబులెన్సులను ఇప్పటికే ఏర్పాటుచేసింది.
హెచ్ఎంఆర్ఐ, ఫిరమిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అంబులెన్సులు నడుస్తాయి. హైవే విస్తరణ కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్ కూడా అంబులెన్సులను ఏర్పాటుచేసింది. కానీ, ఈ అంబులెన్సుల్లో సరైన వైద్యసదుపాయాలు లేవని గ్రహించిన ఎన్హెచ్ఏఐ, అత్యాధునిక వైద్యసదుపాయాలతో కూడిన 1033 అంబులెన్సులను సిద్ధంచేసింది. హైవేపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే.. 1033 అనే టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే 15 నిమిషాల్లోగా అంబులెన్సు ప్రమాద స్థలంలో ఉంటుంది. అక్కడి నుంచి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి చేరుస్తుంది. పరిస్థితి విషమంగా ఉంటే.. అక్కడి నుంచి అందు బాటులో ఉన్న పెద్దాస్పత్రులకు కూడా చేరుస్తుంది.
అనాథలకు ఉచిత వైద్యం
హైవేపై జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఎవరైనా సంబంధీకులు లేకపోతే, వారికి రెండు రోజుల వరకు అత్యాధునిక వసతులతో కూడిన ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించేందుకు కూడా ఎన్హెచ్ఏఐ ఆలోచన చేస్తోంది. జనరల్ ఇన్సూరెన్సు కౌన్సిల్ కొన్ని ఆస్పత్రులతో ముందస్తు ఒప్పందం మేరకు ఇన్సూరెన్సు చేసే ప్రయత్నంలో ఉంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి సంబంధీకులు ఎవరూ లేకపోతే, 1033 అంబులెన్స్ సిబ్బంది ఆస్పత్రిలో చేరుస్తారు. క్షతగాత్రుడికి అయ్యే ఖర్చును ఆస్పత్రి యాజమాన్యం ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకుంటుంది.