ఆ చావుల వెనక మర్మం ఏమిటి?
హాలీవుడ్ థ్రిల్లర్/ ది కాలింగ్ (2014)
పోలీస్ స్టేషన్లో కొన్ని మృతదేహాల ఫొటోలు వేలాడుతున్నాయి. ప్రతి చావులో ఒక భయం. ప్రతి ఆర్తనాదంలో ఓ అర్థం. ముఖాలు వికృతంగా మారిపోయి ఉన్నాయి. తెరుచుకున్న నోళ్లు చిత్రవిచిత్రంగా వంకరలు తిరిగి ఉన్నాయి. చనిపోయినవారందరూ దాదాపు వయసు మళ్లినవాళ్లే. అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లే. అంత దయాదాక్షిణ్యం లేకుండా చంపుతున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? చనిపోయినవారి ముఖాల్లోని ఆ విచిత్ర భావాలకు అర్థమేంటి?
పేరుకి ఇంగ్లిష్ భాష ఒకటే అయినా, దేశ దేశానికి సాహిత్యపు అభిరుచులు వేరు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో రకరకాల అంశాల మీద కథలు, నవలలు వస్తుంటాయి. కెనడా సాహిత్యంలో క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్లకు పెద్ద పీట వేస్తుంటారు. 1999లో ‘ది కాలింగ్’ అనే నవల కెనడాలో, నార్త్ అమెరికాలో, యు.కె.లో విడుదలైంది. రచయిత పేరు ‘ఇంగర్ యాష్ వూల్ఫ్’. అయితే అది ఆ రచయిత కలం పేరు.
విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆ నవల అమ్మకాల్లో సంచలనం సృష్టించింది. పబ్లిషర్లు కూడా ఓ ప్రముఖ రచయిత కలం పేరుతో ఈ నవల రాశాడని ప్రచారం చేయడంతో మార్కెట్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ముసలి కాన్సర్ పేషెంట్‌ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఓ సీరియల్ కిల్లర్, అతణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేసే ఓ లేడీ పోలీసాఫీసర్ మధ్య సాగే కథ ఈ నవల. ఆ రచయిత అసలు పేరు మైఖేల్ రెడ్‌హిల్. ఓ ప్రముఖ పత్రికా సంపాదకుడు. కారణాలు ఏమైనా కానీ ‘ఇంగర్ యాష్ వూల్ఫ్’ కలం పేరుతో 2008తో రచనలు ప్రారంభించినా రెడ్‌హిల్ 2012 వరకూ తన ఐడెంటిటీ బయటపెట్టలేదు. ఆ కలం పేరుతో అదే డిటెక్టివ్ క్యారెక్టర్‌తో వరుసగా నాలుగు నవలలు రాశాడు. 2008లో రాసిన ఈ నవల 2012లో వెర్టికల్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ దృష్టిలో పడింది. ఏడాదికి 24 సినిమాలు రిలీజ్ చేయాలని తహతహలాడిన ఆ నిర్మాణ సంస్థ ‘ది కాలింగ్’ సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నించింది. దర్శకుడు జేసన్ స్టోన్‌కి ఇది తొలి చిత్రం.
కథ విషయానికొస్తే - ఇన్స్పెక్టర్ హెజెల్ మిక్లిఫ్ ఓ చిన్న పట్టణంలోని లేడీ పోలీసాఫీసర్. ఓ ముసలావిడని ఎవరో చంపేశారని కబురు రావడంతో ఆ ఇంటికెళ్తుంది. ఆ వృద్ధురాలి ముఖాన్ని పక్కకి విరిచి మరీ చంపారు. మరొకతన్ని అయితే చంపేసి, కుక్కలకి ఆహారంగా పడేశారు. అతని ముఖమూ అంతే. బాధతో అరుస్తుంటే, మెడ విరిచేసినట్లుగా ఉంది.
ఇలా ప్రతీ శవం... విచిత్రమైన, వికృతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో! అయితే వాటి వెనక ఉన్న అర్థం వేరు. ఆ వికృతమైన ముఖాలు కలిపితే ఏర్పడ్డ పదం లిబెరా (ఔఐఆఉఖఅ). అదో లాటిన్ పదం. క్రైస్తవ మత సంప్రదాయాల్లో ఆ పదానికి ఓ పవిత్రత ఉంది. హెజెల్ ఈ లాటిన్ పదం, దాని వెనక ఉన్న కారణం తెలుసుకోవడానికి ఓ చర్చి ఫాదర్‌ని కలుస్తుంది. చనిపోయినవారి మృతదేహాలు ఖననం చేసే ముందు, వారి ఆత్మలకి శాంతి కలగాలని, భయంతో వణుకుతున్న వారి తప్పులని క్షమించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ తోటి క్రైస్తవులు ఆలపించే గీతమే ‘లిబెరా మీ’. ఆ సీరియల్ కిల్లర్ ఈ మాట ఎందుకు వాడాడు? ఈ హత్యల వెనక అతని ఆంతర్యం ఏమిటి?
ఒక్కో ముఖంలో భావం ఒక్కో ఇంగ్లిష్ అక్షరాన్ని సూచిస్తోంది. ఆ 12 మంది ముఖాల్లోని భావాలు కలిపితే, 12 అక్షరాల పదం ఏర్పడుతుంది. రిసరెక్షన్ అంటే ‘పునరుత్థానం’ అని అర్థం. గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేయబడ్డ జీసస్ ఆదివారం ఈస్టర్ రోజున పునరుత్థానం చెందారు. 12 మంది ఆత్మత్యాగం చేయడం వల్ల జీసస్ పునరుత్థానం సంభవించిందని ఆ కిల్లర్ భావిస్తున్నట్లు చర్చి ఫాదర్ చెప్పాడు. ఈ 12 మంది చనిపోవడం వల్ల ఎవరు తిరిగి బతుకుతారు? ఆ సీరియల్ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
ఆ ఊరిలో కొత్తగా ఓ వ్యక్తి ఎంటరయ్యాడు. అతని పేరు సైమన్. అతనే హంతకుడని, అతని అసలు పేరు పీటర్ అని పోలీసాఫీసర్ హెజెల్ తెలుసుకుంటుంది. ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తన సోదరుణ్ణి తిరిగి బతికించాలనే ప్రయత్నంలో ఈ 12 హత్యలకి పాల్పడ్డాడనే విషయం హెజెల్ తెలుసుకుంటుంది.
సోదరుడి శవాన్ని తన వెహికల్లో ఉంచుకుని తిరుగుతుంటాడు పీటర్. చివరికి చర్చి ఫాదర్‌ని కూడా చంపడానికొస్తాడు. ఫాదర్ ఆత్మత్యాగానికి సిద్ధపడ్డా, తాను చేస్తున్నది సరైనదా కాదా అనే సందేహంలో పడతాడు. పోలీసాఫీసర్ తెలుసుకుని వచ్చేటప్పటికి చర్చి ఫాదర్ చనిపోతాడు. ఫాదర్ చావుతో మొత్తం 11 మంది చనిపోయారు. ఇక 12వ వ్యక్తి ఎవరు?
పీటర్ ఫైనల్ టార్గెట్ ఎవరో తెలుసుకుంటుంది హెజెల్. అతణ్ణి కాపాడటానికి ఏర్పాట్లు చేసి, ఇంటికొచ్చేటప్పటికి పీటర్ ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. హెజెల్కి మత్తుమందులు ఇచ్చి, తన సోదరుడి కోసం చనిపొమ్మని అడుగుతాడు పీటర్. హెజెల్ విషం తాగడానికి సిద్ధపడి, చివరి నిమిషంలో మనసు మార్చుకుంటుంది.
పీటర్ తన 12వ వ్యక్తిగా తనని తానే చంపుకుంటాడు. పీటర్ సోదరుడి శవం ఉన్న వెహికల్ మీద పోలీసులు రెయిడ్ చేస్తే, అది ఖాళీగా ఉంటుంది. నిజంగానే అతను తిరిగి బతికాడా అనే ప్రశ్నార్థకంతో సినిమా పూర్తవుతుంది. - తోట ప్రసాద్
క్రైస్తవ మతం నేపథ్యంలో హాలీవుడ్లో కొన్ని థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో 1995లో వచ్చిన ‘సెవెన్’ సినిమా ఒకటి. బైబిల్లో సెవెన్ సిన్స్ (ఏడు తప్పులు)కి ఏయే శిక్షలుంటాయో పేర్కొనడం జరిగింది. ఓ ఉన్మాది దాని ప్రకారం శిక్షలు విధించి, చంపడమే ‘సెవెన్’ సినిమా కథ. ప్రసిద్ధ దర్శకుడు శంకర్ హీరో విక్రమ్‌తో తీసిన ‘అపరిచితుడు’ సినిమాలో ‘గరుడ పురాణం’ ప్రకారం పాపులకు శిక్ష విధించడం వెనక ‘సెవెన్’ ప్రభావం ఉంది. ‘సెవెన్’ సినిమాలో నేరస్థుడికి శిక్ష విధించిన తర్వాత గోడమీద బైబిల్లోని వాక్యాలు రాస్తుంటాడు హంతకుడు. అలాగే ‘అపరిచితుడు’ చంపాక, ఆ శవాల దగ్గర ‘గరుడ పురాణం’లోని శిక్షలు రాసి ఉంటాయి.