మల్లె గుండెల్లో గుబులు
► ప్రాణాలు తీస్తున్న రాజధాని భూసమీకరణ
► పొక్లెయిన్లతో పచ్చని పంటల తొలగింపునకు యత్నం
► తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు
► పదే పదే పంటపై దాడి
► ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలు
మంగళగిరి : నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో గల రాజధాని గ్రామాల్లో భూసమీకరణ ఎంత అవస్థలు పెట్టిందో ఇప్పుడు భూముల చదును అంతకంటే ఆందోళన కలిగిస్తూ ప్రాణాలు తీస్తోంది. మండలంలోని కురగల్లులో కౌలు భూములలోని మల్లె తోటలను అధికారులు తొలగిస్తే అప్పు ఎలా తీర్చాలోనని ఆందోళనతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం తెలిసిన చుట్టుపక్కల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు భయపడుతున్నారు. రాజధానికి తీసుకున్న భూములన్నింటిలో నిర్మాణాలు పూర్తయిన తర్వాతే పూలతోటలు తొలగిస్తామని అప్పట్లో మంత్రులు, అధికార పార్టీ నేతలు చెప్పారు.
ఇప్పుడేమో వారానికోసారి తోటల దగ్గరకు పొక్లెయిన్లతో వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. వాస్తవానికి మండలంలోని పూలతోటలు అధికంగా పండే నిడమర్రు, కురగల్లు, బేతపూడి గ్రామాలు తొలి నుంచి భూసమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు గ్రామాల్లో సుమారు 1600 ఎకరాలలో మల్లె తోటలు సాగవుతున్నాయి. నిడమర్రు గ్రామంలో ఇప్పటికి 800 ఎకరాలకుపైగా సమీకరణకు ఇవ్వకుండా రైతులు సాగు చేస్తున్నారు. ఇక బేతపూడి, కురగల్లు గ్రామాల్లోనూ రెండు వందల ఎకరాలకుపైగా సమీకరణకు ఇవ్వని పూల తోటలున్నాయి.
అన్నీ కల్లబొల్లి మాటలే..
అయితే మంత్రులు, అధికార పార్టీ నేతలు, అధికారుల మాటలు విని కొందరు రైతులు సమీకరణకు ఇచ్చారు. అందులో సుమారు మూడు వందలకు ఎకరాలకుపైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. మల్లెతోటకు ఏడాదికి రూ. లక్ష వంతున కౌలు చెల్లిస్తున్నారు. ఆయా మల్లెతోటలపై రైతు, కౌలు రైతు, కూలీలు వెరసి నాలుగు వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మల్లె తోట ఒకసారి మొక్క నాటితే పది నుంచి పదిహేనేళ్ల వరకు సాగవుతుంది.
ఈ నేపథ్యంలో కౌలు రైతులు దీర్ఘకాలం సాగు కోసం కౌలుకు తీసుకుని ఎకరాకు రూ. 2 లక్షలకుపైగా పెట్టుబడి పెడతారు. ఇప్పుడు అర్ధంతరంగా పూలతోటలను తొలగిస్తే ఎలా జీవిస్తామని ప్రశ్నిస్తున్నారు. దీంతో పూల తోటల తొలగింపును అడ్డుకుంటున్నారు. అనేక గ్రామాల్లోని భూముల్లో పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయని, ముందుగా వాటిని తొలగించాలని రైతులు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లను కలిసి విన్నవించారు. అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా పచ్చని తోటలను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.