మైక్రోసాప్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మైక్రోసాప్ట్ ఇండియా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. సంరక్షకుని సెలవు(కేర్‌గివర్ లీవ్) పేరిట నాలుగు వారాల పెయిడ్ లీవ్‌ను ప్రకటించింది. కుటుంబసభ్యులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే వారికి సంరక్షకునిగా ఉండేందుకు ఈ పెయిడ్ లీవ్‌ను ఉద్యోగులకు అందించనున్నట్టు మైక్రోసాప్ట్ పేర్కొంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తామామలు, తోబుట్టువులు, తాతయ్య,నాన్నమ్మలు, సంతానం వంటి వారిని ప్యామిలీ కేర్‌గివర్ లీవ్‌లో చేర్చింది. ఈ సెలవు కింద ఉద్యోగులకు వేతనం చెల్లించనుంది.
గతేడాదే కంపెనీ ప్రసూతి సెలవు కింద 26 వారాలను తమ ఉద్యోగులకు అందించనున్నట్టు ప్రకటించింది. పురుష ఉద్యోగులు కూడా ఆరు వారాల పితృత్వ సెలవును పెట్టుకోవచ్చని తెలిపింది. దీనిలోనే సరోగసీ లేదా దత్తత కూడా ఉంటాయని చెప్పింది. కుటుంబసభ్యులకు వారి అవసరం మేరకు ఉద్యోగులు ఏం చేయాలనిపిస్తే అది చేసుకునే విధంగా తమ విధానాలను రూపొందిస్తున్నామని మైక్రోసాప్ట్ హెచ్ఆర్ అధినేత ఇరా గుప్తా తెలిపారు. సంరక్షకుని సెలవును విస్తరించుకోవచ్చు. ఏడాదంతంటా ఉద్యోగి ఏ రూపంలోనైనా దీన్ని వాడుకోవచ్చని పేర్కొన్నారు. భారత్ లో మైక్రోసాప్ట్ కు 8000 మంది ఉద్యోగులున్నారు. ముఖ్యంగా మహిళలు వర్క్ చేస్తున్న ప్రాంతాల్లో తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనని కన్సల్టెంట్స్ చెబుతున్నాయి.