బ్రెయిన్‌కు ఆపరేషన్ చేస్తున్నా...
మాడ్రిడ్: ఆయనకు సంగీతమంటే ప్రాణం. అందుకే మెదడుకు ప్రాణాంతకమైన ఆపరేషన్ జరిగిన 12 గంటలపాటు నిర్విరామంగా సాక్సోఫోన్‌లో తనకిష్టమైన జాజ్ గీతాలను ఆలపిస్తూనే ఉన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న 16 మంది మెడికోలు కూడా ఓ పక్క సంగీత మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే మరోపక్క 12 గంటలపాటు ఏకాగ్రత చెక్కు చెదరకుండా విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
స్థానిక బ్యాండ్‌లో కీలక కళాకారుడిగా రాణిస్తున్న ఆ సంగీత ప్రియుడి పేరు కార్లోస్ ఆగిలెరా. స్పెయిన్‌లోని మలాగా నగరానికి చెందిన 27 ఏళ్ల ఆగిలెరాకు బాల్యం నుంచి సంగీతమంటే పిచ్చి. బ్రెయిన్ స్కానింగ్‌లో ఆయనకు ట్యూమర్ (కణతి) ఉన్నట్టు బయట పడింది. రెండు నెలల క్రితం ఆపరేషన్ కోసం మలాగాలోని కార్లోస్ హయా ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్ కారణంగా తన సంగీత సామర్ధ్యం ఏ మాత్రం దెబ్బతినకుండా చూడాలని వైద్యులను కోరారు. సంగీత సామర్థ్యానికి సంబంధించిన బ్రెయిన్ ప్రాంతం దెబ్బతింటుందా, లేదా ? అన్న విషయం డాక్టర్లకు ఎప్పటికప్పుడు తెలియడం కోసం ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు తాను సాక్సోఫోన్‌ను ప్లే చేస్తూనే ఉంటానని చెప్పారు. అలా ఆపరేషన్ చేయడానికి తాము సిద్ధమేనని, సంగీత వాయించడం, వాయించకపోవడం రోగి ఇష్టమని వారు సూచించారు.
ఏది ఏమైనా ప్రాణప్రదమైన సంగీత జ్ఞానాన్ని వదులుకోవడానికి ఇష్టపడని ఆగిలెరా, ఆపరేషన్ సందర్భంగా సాక్సోఫోన్ ప్లే చేయడానికి సిద్ధపడ్డారు. అనస్థిషియా ఇస్తే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉండడంతో ఆయనకు డాక్టర్లు కాస్త మత్తునిచ్చే సెడెటివ్స్, నొప్పి తెలియకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఆయన సాక్సోఫోన్‌ను పట్టుకునేందుకు, జాజ్ గీతాల నోట్సును చూసేందుకు ఓ మెడికో సహకరించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు న్యూరోసర్జన్లు, ఇద్దరు న్యూరోసైకాలోజిస్టులు, ముగ్గురు న్యూరోఫిజిషియన్లు, ఓ అనెస్థియాటిస్ట్. ఐదుగురు నర్సులు పాల్గొన్నారు. వైద్య బృందం విజయవంతంగా కణతిని తొలగించి ఆపరేషన్ పూర్తి చేశారు. అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఈ ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి ఆగిలెరాకు రెండు నెలలు పట్టింది.
బుధవారం నాడే మొట్టమొదటి సారిగా బయటకొచ్చిన ఆగిలెరా తన అనుభవం గురించి మీడియాకు తెలిపారు. తనకు ప్రాణం కన్నా సంగీతమే ఇష్టమని, అందుకనే రిస్క్ తీసుకున్నానని చెప్పారు. ఈ తరహా ఆపరేషన్ చేయడం మొత్తం యూరప్‌లోనే మొట్టమొదటి సారని ఆయనకు చికిత్స చేసిన ప్రముఖ న్యూరోసర్జన్ గిలెర్మో ఇబానెజ్ తెలిపారు. నాటి వైద్యానికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇలాంటి తరహా ఆపరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో నిర్వహించారు. అమెరికాలోని మిన్నెసోట ఆర్కెస్ట్రాకు చెందిన ప్రముఖ వయోలనిస్ట్ రోగర్ ఫ్రిష్, బ్రెయిన్ ఆపరేషన్ సందర్భంగా వయోలిన్ వాయించి రికార్డు సృష్టించారు. ఆయనకు రికార్డు కోసం కాకుండా ఆపరేషన్ వల్ల సంగీత సామర్ధ్యాన్ని కోల్పోకూడదన్నదే లక్ష్యం.