కుక్కు అరుదైన గౌరవం
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలెస్టర్ కుక్ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ సత్కారంలో భాగమైన కమాండర్స్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్(సీబీఈ) పురస్కారానికి కుక్ ఎంపికయ్యాడు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ 2 తొంభైవ జన్మదినం కానుకగా ఇవ్వనున్న పురస్కారాల జాబితాలో కుక్ పేరును ఎంపిక చేశారు. దాంతో పాటు ఇంగ్లండ్ మాజీ ఫుట్ బాల్ కెప్టెన్ అలెన్ షీరర్, 2005 జూలై ఏడవ తేదీన లండన్ లో జరిగిన బాంబు దాడుల్లో తన కాళ్లు కోల్పోయిన వాలీబాల్ క్రీడాకారిణి మార్టిన్ విల్ట్ షైర్ కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. క్రీడల్లో చేసిన సేవలకు గాను ఈ ముగ్గురి పేర్లను సీబీఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
అంతకుముందు 2011లో కుక్ కు మెంబర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్(ఎంబీఈ) పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. 2010-11వ సీజన్లో ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కుక్ తొలిసారి బ్రిటీష్ సత్కారాన్ని అందుకున్నాడు. ఇటీవల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పిన్న వయసులో టెస్టుల్లో నెలకొల్పిన పదివేల పరుగుల రికార్డును కుక్ అధిగమించిన సంగతి తెలిసిందే. గత నెల్లో శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా కుక్ ఈ ఫీట్ ను సాధించాడు.