పేదింటిపై సిమెంట్ పిడుగు
సాక్షి, ఇల్లంతకుంట (కరీంనగర్): అందమైన సొంతిల్లు ప్రతీ ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకునేందుకు బ్యాంకులోనో, ఇతరు వద్దనో అప్పు చేసి తమ కలలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బడ్జెట్లో ఏ కొంత మొత్తం పెరిగిన ఆ ఇంటి నిర్మాణ వ్యయం తలకిందులవుతుంది. నిర్మాణం మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఇలాగే ఉంది. పెరిగిన సిమెంట్ ధరలతో గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా బస్తాకు రూ.50 నుంచి రూ.80 పెరగడంతో నిర్మాణాలు కొనసాగించాలా వద్దా అని నిర్మాణదారులు ఆలోచనలో పడ్డారు. గతంలో ఒక్కో బస్తా రూ.250 ఉంటే ఇప్పుడు ధర రూ.340కి చేరింది. ఒక్క బస్తా సిమెంట్ బస్తా ధర రూ.50 నుంచి రూ.80 వరకు పెరగడంతో ఇంటి నిర్మాణాలపై పిడుగు పడినట్లయింది.
పెద్దోళ్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా సామాన్యుల పేదోళ్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగించడం కష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సిమెంట్ దుకాణాల్లోనూ గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇంటి నిర్మాణాలు అర్థాంతరంగా నిలచిపోతున్నాయి. ఒక్కో బస్తాకు రూ.50ల చొప్పున లెక్కేసుకున్నా 100 బస్తాలకు రూ.5 వేల అదనపు భారం కావడం, ఇంకా పెరిగితే మరింత భారం తప్పదని సామాన్యులు వాపోతున్నారు. మరోవైపు గ్రామాల్లో పలు కాలనీల్లో చేపడుతున్న మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు సైతం సిమెంట్ ధరల పెరుగుదలతో నిలిచిపోయాయి.
సదరు కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేసి ముఖం చాటేస్తున్నారు. ఇలా çమండలంలో సిమెంట్ ధరల పెరుగుదల ప్రభావం అటు అభివృద్ధి పనులపై, ఇటు సామాన్యులపై ఇంటి నిర్మాణాలపై పడిందని పలువురు వాపోతున్నారు. సిమెంట్ బస్తా ధర రూ.280, రూ, 290, రూ.300 వరకు ఇలా కంపెనీల వారిగా పలికేవి. ఇప్పుడు వాటిపై ఏకంగా రూ.50 నుంచి రూ.60 వరకు అదనంగా పెరగడంతో భారంగా మారింది. ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగుతుందో లేక పెరుగుతుందోనని సామాన్యులు వాపోతున్నారు. దీంతో నిర్మాణాలు ఇప్పట్లో చేపట్టడం మంచిది కాదని మద్యలోనే నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇల్లు కట్టడం కష్టమే
త్వరలో కొత్తగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని పనులు చేసుకుంటున్నా. ఈలోగా సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో నిర్మాణం చేపట్టాలంటే భయమేస్తోంది. ఇంటి నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయింది. ఇంతటితో ఆగకుండా ఇంకా ధర పెరిగితే అదనపు భారం భరించలేం. అందుకే ఇంటి నిర్మాణం ఆలోచన మానుకుంటున్నా.
– పొనగంటి సుధాకర్, నిర్మాణదారుడు
గిరాకీ తగ్గింది
పెంచిన సిమెంట్ బస్తాల ధరతో ఒక్కసారిగా సిమెంట్‌కు ధరలు పెరిగాయి. దీంతో గృహ నిర్మాణదారులు సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో రోజురోజూకి గిరాకీ తగ్గుతుం ది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో కొనేందుకు వచ్చి నిరాశతో వెళుతున్నారు.
– బొడ్ల కుమార్, సిమెంట్ షాపు యాజమాని
పని దొరుకుతలేదు
పెరిగిన సిమెంట్ ధరలతో గృహ నిర్మాణదారులు ఇళ్లను నిర్మించుకోవాలంటే జంకుతున్నారు. పెరిగిన సిమెంట్ ధరల కారణంగా ఇంటి నిర్మాణాలు జరగకపోవడంతో కూలీ దొరకడం లేదు. పెంచిన సిమెంట్ ధరలను తగ్గించాలని కోరుతున్నా.
– రావుల నాగరాజు, తాపీ మేస్త్రీ