విభిన్న కథాంశంతో చెంజిట్టాలే ఎన్ కాదల్
చెంజిట్టాలే ఎన్ కాదల్ చిత్రం పేరులో కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది కదూ అయితే ఇది మహిళల్ని కించపరచే కథా చిత్రం మాత్రం కాదు అంటున్నారు ఈ చిత్రం ద్వారా దర్శకుడుగానూ, కథానాయకుడిగాను పరిచయం అవుతున్న ఎళిల్. ఇంతకు ముందు 50కి పైగా షార్ట్ ఫిలింస్‌లో నటించిన ఆయన కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగానూ పని చేశారట. ముఖ్యంగా చెంజిట్టాలే ఎన్ కాదల్ చిత్రం కథనం ఇప్పటి తమిళ చిత్రాల ట్రెండ్‌ను బద్దలు కొడుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా అంటున్నారు.
కాగా బుల్లి తెర నటి మధుమిత నాయకిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆమెకు తల్లిగా మెడ్రాస్, కత్తి చిత్రాల ఫేమ్ రమ, తండ్రిగా కబాలి, మెడ్రాస్, మారి చిత్రాలతో గుర్తింపు పొందిన మైమ్‌గోపి నటిస్తున్నారు. హీరోకు తండ్రిగా అజయ్త్న్రం, మరో ముఖ్య పాత్రలో నటి అభినయ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో కయల్ విన్సెంట్, అర్జునన్ తదితరులు నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శక, హీరో ఎళిల్ తెలుపుతూ ఇది ప్రేమలో విఫలమైన హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు, ఆ తరువాత అవి ఎలా పరిష్కారం అయ్యాయి అన్న సంఘటనల సమాహారంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిపారు. ఇటీవల ప్రేమ మలినపడుతోందని బాగా వినిపిస్తోందన్నారు.
అందుకు కారణం ఏమిటన్న అంశాలను ఈ చిత్రంలో చర్చించినట్లు తెలిపారు. అయితే ఇది స్త్రీ, పురుషులిద్దరికీ సంబంధించిన అంశాన్ని చర్చించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి నిర్మాత బాలసుబ్రమణియన్ తీవ్రప్రయత్నం, సహకారం పక్కా బలంగా నిలిచాయని ఎళిల్ పేర్కొన్నారు.