కొత్త స్టార్టప్ లకు కోటిన్నర సాయం!
♦ ఈనెలాఖరు నుంచి స్టార్టప్‌లకు గ్రేడింగ్
♦ దీంతో ఇన్వెస్టర్లకు ఫండింగ్ చేయటం ఈజీ
♦ మార్చి నుంచి స్టార్టప్, ఎస్ఎంఈలకు బ్యాంకు రుణాలు
♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో గ్రెక్స్ ఫౌండర్, సీఈఓ మనీష్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలకు నిధులు సమీకరించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే షేర్లు, డిబెంచర్లతో పాటు రకరకాల మార్గాలుంటాయి. లిస్ట్ కాకున్నా పెద్ద పెద్ద కంపెనీలున్నాయంటే వాటిక్కూడా నిధులు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలో, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ల డ్లో ఆదుకుంటాయ్!! మరి, అప్పుడే ప్రారంభించిన స్టార్టప్స్.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఈ) పరిస్థితేంటి? చక్కని ఆలోచనతో ఆరంభించినా.. నిధుల్లేక ఇవి పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీటికోసమే మీమున్నామంటోంది గ్రెక్స్. 2013లో పుణే కేంద్రంగా ప్రారంభమైన గ్రెక్స్ సేవల వివరాలు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ మనీష్ కుమార్ మాటల్లోనే..
ఏ కంపెనీ విస్తరణ చేపట్టాలన్నా కావాల్సింది పెట్టుబడులే. అయితే అన్ని సంస్థలూ సొంతంగా పెట్టుబడులను సమకూర్చుకోలేవు. నిధులను సమీకరిద్దామంటే ఇన్వెస్టర్లను ఎలా ఒప్పించాలో తెలియదు. ఒకవేళ తెలిసినా ఎంత పెట్టుబడికి ఎంత ఈక్విటీ ఇవ్వాలన్న దానిపై లోతైన అవగాహన ఉండదు. ఇలాంటి స్టార్టప్‌లకు, అన్‌లిస్టెడ్ కంపెనీలకు, ఎంఎస్ఈలకు ఈ పనులను చేసిపెట్టడమే గ్రెక్స్ పని. అంటే ఆయా సంస్థల నిర్వహణ నుంచి మొదలుపెడితే పనితీరు, వాల్యుయేషన్స్‌ను లెక్కగట్టి ఇన్వెస్టర్లను ఒప్పించి పెట్టుబడులు పెట్టేలా చేసే వరకు సంస్థకు తోడుగా ఉంటుందన్న మాట.
450 స్టార్టప్స్, 800 మంది ఇన్వెస్టర్లు..
ప్రస్తుతం గ్రెక్స్లో సోలార్ టౌన్, ఈవెంటస్ సాఫ్ట్వేర్, టురాకో మొబైల్ ప్రై.లి. వంటి 450 స్టార్టప్స్, కునాల్ బజాజ్, రాంపాల్ చావ్లా, చంద్రు బద్రీనారాయణ, రాజేశ్వరీ భట్టాచార్య, రేణు సింగ్ వంటి 800లకు పైగా ప్రైవేట్ ఇన్వెస్టర్లు రిజిస్టరై ఉన్నారు. గ్రేక్స్ వేదికగా ఫండింగ్ పొందిన సంస్థ నెక్స్‌జెన్ పేపర్ సొల్యూషన్ ప్రై.లి. సంస్థ. 2015 అక్టోబర్‌లో ఈ సంస్థ 1.5 కోట్ల నిధులు సమీకరించింది. మరో నాలుగు నెలల్లో 12 స్టార్టప్స్ నిధులను సమీకరించేందుకు రెడీగా ఉన్నాయి. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఒక్కో స్టార్టప్ కనీసం 1.5 కోట్లు సమీకరిస్తాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 5 కంపెనీలుంటాయి. ‘‘గతేడాది అక్టోబర్‌లో మా సంస్థలో పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్లు రూ.4 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరో రూ.8-10 కోట్ల నిధులను సమీకరించేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. ఆయా పెట్టుబడులను గ్రెక్స్ సేవల విస్తరణ, టెక్నాలజీ అభివృద్ధి కోసం వినియోగిస్తామని’’ మనీష్ వివరించారు.
స్టార్టప్‌లకు గ్రేడింగ్, రుణాలు:వచ్చే నెల నుంచి గ్రెక్స్లో రిజిస్టరైన స్టార్టప్ గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని ప్రారంభించునున్నాం. ఇందుకోసం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (కేర్)తో ఒప్పందం చేసుకున్నాం. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు మార్గం సులువవుతుంది. అం టే మంచి గ్రేడింగ్ ఉన్న స్టార్టప్‌ను ఎంచుకునే వీలుం టుందని అర్థం. తొలిసారిగా గ్రెక్స్ క్రెడిట్ గ్యారంటీ కింద 7 బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో (ఎన్బీఎఫ్సీ) చర్చిస్తున్నాం. దీంతో గ్రెక్స్ వేదికగా స్టార్టప్‌లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వీలుంటుంది. వచ్చే నెల నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.
మెంటరింగ్, వాల్యుయేషన్స్ కూడా..
స్టార్టప్స్, ఎస్ఎంఈలకు ఫండింగ్ వచ్చేలా చేయటమే కాకుండా ఆయా సంస్థలకు మెంటరింగ్, వాల్యుయేషన్ సేవలను కూడా అందిస్తాం. ఇందుకోసం గ్రెక్స్లో ఇక్సిగో.కామ్ అలోక్ బాజ్‌పాయ్, కే క్యాపిటల్ ఎండీ, ముంబై ఏంజెల్స్ కో-ఫౌండర్ సాష మిర్చందానీ, కాస్మిక్ మండాలా 15 గ్రూప్ చైర్మన్ అశిత్ ఎన్ కంపనీ, ఆర్థిక విశ్లేషకుడు స్వాతిప్రసాద్ దొర, ప్రొఫెసర్ శాంతను భట్టచార్య వంటి వారెందరో ఉన్నారు. ఏర్సీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాండ్స్ ఇండియా, స్మార్ట్ అడ్వైజర్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.comకు మెయిల్ చేయండి...