ఢిల్లీ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మాకెన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ ఎంపీ అజయ్ మాకెన్ నేతృత్వంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దిగనుంది. మాకెన్‌ను ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులుగా నియమించినట్లు ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ చాకో మంగళవారం ప్రకటించారు. 101 మందితో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార కమిటీకి మాకెన్ నేతృత్వం వహిస్తారు. తనకు పార్టీ అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని ఢిల్లీలో మాకెన్ మీడియాతో అన్నారు.ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని స్పష్టంచేశారు.
21 మందితో బీజేపీ ఎన్నికల కమిటీ
21 మంది సభ్యులతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కమిటీని బీజేపీ మంగళవారం ప్రకటించింది. ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందించే ఈ కమిటీకి బీజేపీ, ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ సహా ఢిల్లీలోని ఏడుగురు పార్టీ ఎంపీలు, విజయ్ గోయల్, వీకే మల్హోత్రా, జగదీశ్ ముఖి తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు.