'ఛేంజింగ్ రూం స్కాం'పై ఉన్నతస్థాయి విచారణ: సీఎం
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన 'ఛేంజింగ్ రూం స్కాం'పై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోందని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు. పనజికి సమీపంలోని కండోలిమ్ నగరంలోగల ఫ్యాబ్‌సిటీ అనే ఓ బొటిక్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దుస్తులు కొనుక్కుని వాటిని ట్రై చేస్తుండగా.. ఆ ట్రయల్ రూం బయట కెమెరా ఉండటాన్ని గుర్తించారు. దానిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు కూడా వెళ్లింది.
తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి రెండు రోజులు గోవాలో సరదాగా సెలవులు గడిపేందుకు వచ్చిన స్మృతి ఇరానీకి ఈ చేదు అనుభవం ఎదురైంది. అందులోనూ బీజేపీయే అధికారంలో ఉన్న గోవా రాష్ట్రంలో ఇలా జరగడంతో అంతా గందరగోళం చెలరేగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చెప్పారు. కెమెరాను కావాలని ఏర్పాటుచేశారా లేదా నిఘా కోసం పెట్టినదేనా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. గోవా రాష్ట్రం మహిళలకు, పర్యాటకులకు అత్యంత సురక్షితమైన ప్రదేశమేనని ఆయన చెప్పారు.