రాజు గారికి కోపం వచ్చింది!
ఆయనో మాజీ రాజుగారు. అంతేకాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకోవాలనుకున్నాడు. ఆయన అనుకున్నంత మొత్తం రాలేదు. అంతే, ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ మీద ఓ కేసు పెట్టేశారు! ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. విశ్వేంద్ర సింగ్ (54) బ్యాంకు నుంచి రూ. 10వేలు తీసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కు వెళ్లారు. దాదాపు గంటసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆయన వంతు వచ్చిన తర్వాత.. అప్పటికే చాలా నగదు అయిపోవడంతో, పదివేలు ఇవ్వడం కష్టమని, బ్యాంకులో కేవలం రూ. 3 లక్షలు మాత్రమే ఉన్నాయని.. అందువల్ల మిగిలినవారికి ఇవ్వడానికి వీలుగా 2వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.
దాంతో విశ్వేంద్రసింగ్కు ఎక్కడ లేని కోపం వచ్చింది. రిజర్వు బ్యాంకుకు పెద్దనోట్ల రద్దు గురించి తెలిసినప్పుడు.. వాళ్లు ఎందుకు తగినన్ని నోట్లు ముద్రించలేదని ప్రశ్నించడమే కాక.. నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి రిజర్వు బ్యాంకు గవర్నర్ మీద, తనను నిరుత్సాహపరిచిన బ్యాంకు మేనేజర్ మీద చీటింగ్ కేసు పెట్టారు. పోలీసులు తన ఫిర్యాదు తీసుకున్నా, ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని, దీన్ని తాను ఇంతటితో వదలకుండా కోర్టుకు తీసుకెళ్తానని చెప్పారు. తగిన దర్యాప్తు చేసిన తర్వాత తాము దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలుచేస్తామని పోలీసులు అన్నారు.