‘వైఎస్ జగన్ సభలకు వచ్చారని వేధిస్తున్నారు’
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 16న వేజండ్లకు వచ్చిన క్రమంలో ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలను చేబ్రోలు ఎస్ఐ ఆరోగ్యరాజు వేధింపులకు గురి చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి వివరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ ఎస్పీ త్రిపాఠిని శనివారం బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన వాస్తవ పరిస్థితులను తెలిపారు.
సెల్‌ఫోన్‌కు సంబంధించిన ఒక ఘర్షణకు సాకుగా చూపి వేజండ్ల వార్డు మెంబర్ షేక్ సంధాని, గౌస్‌లను స్టేషన్‌కు పిలిపించి ఇష్టానుసారం కొట్టారని ఆరోపించారు. అయితే దీనిపై బాధితులు ఆస్పత్రికి వెళితే కేసులు పెడతానంటూ ఎస్ఐ బెదిరించారన్నారు. అప్పటికే సంధాని, గౌస్‌ల వద్ద తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేస్తామని వేధిస్తున్నారని వివరించారు. వైఎస్ జగన్ ర్యాలీకి ఎందుకు వెళుతున్నారంటూ ఎస్ఐ అడిగారని బాధితులు పేర్కొన్నారు. ఎస్ఐ వేధింపులను తట్టుకోలేకపోతున్నామని వారు తెలియజేశారు.