child brides
-
మహిళలు.. ఆ ఐదు విజయాలు
సాక్షి, వెబ్‌డెస్క్ : వైద్య, విద్యా రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన హక్కులు లభిస్తున్నాయి. కానీ ఆర్థిక స్వాలంబన, రాజకీయ రంగంలో సమాన అవకాశాలు ఇప్పుడప్పుడే లభించేలా లేవు. ‘ఆటంకాలను అధిగమించి మహిళలు సాధికారత సాధించేందుకు ఇంకో వందేళ్లయినా పడుతుంద’ని ప్రపంచ ఆర్థిక సంస్థ సైతం పేర్కొంది. ఈ క్రమంలో మహిళా హక్కుల రక్షణ అంశంపై వాషింగ్టన్లో జరిగిన చరిత్రాత్మక సదస్సు ‘వుమెన్స్ మార్చ్’ .. అతివలకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. సాధికారత సాధన కోసం ఆ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలు కాలక్రమంలో చట్టాలుగా మారిన తీరు ఎంతైన అభినందనీయం. అలా 2018లో ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు లభించిన ఐదు ప్రధాన విజయాలను(హక్కులను) ఓసారి పరిశీలిస్తే.. ఐస్లాండ్లో సమాన వేతనం.. జాతి, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన వేతనాలు కల్పించే చట్టాన్ని తెచ్చింది ఐస్లాండ్ ప్రభుత్వం. ఈ చట్టం ద్వారా మహిళలకు కూడా పురుషులతో సమాన వేతనాలు కల్పించాలి. దేశంలో గల 1200 కంపెనీలు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందే. పనిచేసే వారి సంఖ్య 25 మంది కంటే ఎక్కువ ఉన్న కంపెనీలు కచ్చితంగా తాము అనుసరిస్తున్న వేతన ప్రమాణాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే. ఏడాది మొదటి రోజు నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ అవకాశం కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో గత దశాబ్ద కాలంగా చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. సౌదీ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో ఎగ్జిక్యూటివ్‌లుగా, షౌరా కౌన్సిల్( సౌదీ కన్సల్టేటివ్ అసెంబ్లీ) మెంబర్లుగా నియమితులవుతున్న మహిళలకు కొత్తగా డ్రైవింగ్ చేసే హక్కును కల్పించింది ఈ రాచరిక ప్రభుత్వం. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ హక్కు కల్పించినా జూన్ నుంచి అమల్లోకి రానుంది. కానీ ఇక్కడ కూడా మెలిక పెట్టింది. ఇస్లామిక్ చట్టాలకనుగుణంగానే డ్రైవ్ చేయాలి. ‘మీ టు’ ఉద్యమ వెల్లువ స్త్రీ కార్చే ఒక్క కన్నీటి చుక్క చాలు సామ్రాజ్యాలు కూలిపోవడానికి అని పురాణాలు చెబుతున్నాయి. కానీ నేటి ఆధునిక సమాజంలో నీటి చుక్క కార్చటం కాదు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పటం ద్వారా ఎంతటివారినైనా నిగ్గదీయవచ్చని నిరూపించింది.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ ’ఉద్యమం. లైంగిక వేధింపులకు గురైన ఎంతో మంది ఆడవాళ్లు నిర్భయంగా వాటి గురించి చర్చించారు. చట్టానికెవరూ అతీతులు కాదు అని నిరూపించింది హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్స్టన్ ఉదంతం. ‘మా శరీరం మాకే సొంతం.. ఎవరికీ అంటే ఇంకెవరికీ కాదు’ అనే నినాదంతో, #బ్యాలన్స్టాన్పోర్క్(ఔట్ యువర్ పిగ్) అనే హాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేస్తున్నారు మహిళలు. బాలికా వధువులకు రక్షణ కల్పించిన భారత్.. సనాతన దేశంగా చెప్పుకునే భారత్‌లోనూ మహిళలు, ముఖ్యంగా బాలికల హక్కులపై న్యాయస్థానాలు గొప్పతీర్పులు ఇచ్చాయి. మైనర్ భార్యతో కాపురం చేయటాన్ని (ఆమె అనుమతి ఉన్నా లేకున్నా) రేప్‌గా పరిగణిస్తామంటూ గత అక్టోబర్‌లో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం నేరం నిరూపితమైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా అమెరికా అతివలు.. అగ్రదేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2018 చివరినాటికి పదవులు చేపట్టే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘ద సెంటర్ ఫర్ అమెరికన్ వుమెన్ అండ్ పాలిటిక్స్’ తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి 49 మంది, రిపబ్లికన్ పార్టీ నుంచి 28 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో రాణిస్తోన్న అగ్రదేశ మహిళలు మిగతా ప్రపంచానికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
అంగట్లో పెళ్లి కూతుళ్ల అమ్మకం!
సంతలో పశువులను అమ్మినట్లు అక్కడ చిన్నారి పెళ్లి కూతుళ్లను అమ్ముతారు. 13, 14 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలను దాదాపు రెండు లక్షల రూపాయలకే అమ్మేస్తారు. అందులో పెళ్లి కూతురికి నయాపైసా కూడా దక్కదు. చైనా యువకులు వారిని ఎగబడి కొనుక్కున్నా డబ్బులు మాత్రం అమ్మాయిలను విక్రయించిన స్మగ్లర్లకే పోతాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు ఈ విషయం ఎప్పటికీ తెలియదు. అలా అంగడి బొమ్మల్లే అమ్ముడుపోయిన అమ్మాయిలు చైనా యువకులతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఆ తర్వాత జీవితంలో తమ తల్లిదండ్రులను గానీ, పుట్టిన గడ్డను గానీ చూసే అవకాశం ఎప్పటికీ లభించదు. చైనా యువకులు, చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెళ్లి కూతురుకు ఎదురుకట్నం ఇచ్చి, పెళ్లి ఖర్చులు భరించడమే కాకుండా సొంతిల్లు కలిగి ఉండాలి. సొంతిల్లు లేనివారిని పెళ్లి చేసుకునేందుకు చైనా యువతులు ముందుకు రారు. కారణం స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా కారణంగా చైనా అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ. దశాబ్దాల తరబడి ఏక సంతాన విధానాన్ని చైనా ప్రభుత్వం పాటించడం వల్ల ఆ దేశంలో అమ్మాయిల కొరత ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘాలు విశ్లేషించాయి. ఈ కారణం వల్ల చైనాలో పెళ్లి కూతుళ్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకొని చైనాలో అక్రమ మానవ రవాణా ముఠాలు పుట్టుకొచ్చాయి. వారి కన్ను పొరుగునే ఉన్న వియత్నాం సరిహద్దు గ్రామాలపై పడింది. చైనాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వియత్నాం బాలికలను బుట్టలో వేస్తారు. ఫ్రెండ్స్ పార్టీల పేరిట పిలిపించి మద్యం తాగిస్తారు. డ్రగ్స్ ఇస్తారు. వారు ఆ మత్తులో ఉండగానే సరిహద్దు దాటించి చైనా సంతకు తీసుకెళతారు. ఈమధ్య సోషల్ మీడియా ద్వారా కూడా చదువుకుంటున్న వియత్నాం బాలికలను ఎర వేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ వ్యథార్థ గాధలను వినిపించిన లాన్, ఎన్‌గుయన్ వియత్నాం నుంచి చైనాకు అలా చేరిన వారే. 'పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను ఓ రోజు ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు. బలవంతంగా మద్యం తాగించారు. ఇంటికెళ్తానంటే వారించి అక్కడే పడుకోబెట్టారు. తెల్లవారి లేచేసరికి కొత్త ప్రాంతంలో ఉన్నాను. నేను ఎక్కడున్నానని వాకబు చేస్తే చైనాలో ఉన్నానని తెలిపారు. నా పక్కన మరికొంత మంది బాలికలు ఉన్నారు. మా చుట్టూ వస్తాదుల లాంటి గార్డులు ఉన్నారు. ఎంత ప్రతిఘటించినా నన్ను ఓ చైనా యువకుడికి అమ్మేశారు' అని 13 ఏళ్ల లాన్ తన గాధను వెల్లడించింది. 'నన్ను రెండు లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టారు. నేను దాన్ని దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాను. నన్ను చిత్రహింసలకు గురిచేశారు. అన్నం పెట్టకుండా మాడ్చారు. చివరకు చంపేస్తామని బెదిరించారు. చేసేదేమీలేక అంగీకరించాను. రెండు లక్షల ఐదువేల రూపాయలకు ఓ చైనా యువకుడికి అమ్ముడుపోయాను. ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నాను. ఆయన నన్ను బాగానే చూసుకున్నారు. అయినా పుట్టిన దేశాన్ని, తల్లిదండ్రులను చూడకుండా ముక్కూమొహం తెలియని వ్యక్తితో ఎలా కాపురం చేసేది? అడ్జెస్టు కాలేకపోయాను. నా ప్రతిఘటన మళ్లీ మొదలైంది. దాంతో నా అత్త స్మగ్లర్లను పిలిచి నన్ను వారికి అప్పగించింది. తాను వారికి అంతకుముందు చెల్లించిన డబ్బులు వెనక్కి తీసుకుంది. నన్ను తిరిగి వియత్నాం పంపించాల్సిందిగా స్మగ్లర్లను వేడుకున్నాను. వారు వినకుండా మరో చైనా యువకుడికి నన్ను అమ్మేశారు. కథ మళ్లీ మొదటికొచ్చింది' అని 16 ఏళ్ల ఎన్‌గుయన్ వివరించారు. ఇలాంటి కథలు అనేకం ఉన్నాయని వియత్నాంలో ఐక్యరాజ్యసమితి తరఫున మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఓ నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హా తి వ్యాన్ ఖనాహ్ మీడియాకు తెలిపారు. వియత్నాం ప్రభుత్వంతో కలసి తాము ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మానవ అక్రమ రవాణాకు పూర్తిగా తెర పడట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా ముఠాలను పట్టుకొని అరెస్టు చేయడం, వారి నుంచి బాధితులను విడిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఆమె తెలిపారు. స్మగ్లర్ల చేతిలో మోసపోకుండా వియత్నాం బాలికల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా తాము కృషి చేస్తున్నామని చెప్పారు.