Child Line District Co-ordinator
-
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు
విజయనగరం ఫోర్ట్ : ఇంటి నుంచి పారిపోయిన బాలుడిని చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే... తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన విశాఖపట్నం ఆరిలోవకు చెందిన అహముల్లా జైబుల్ రైలు ద్వారా మంగళవారం విజయనగరం వచ్చేశాడు. రాత్రి 8:30 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ ట్రోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది బాలుడ్ని చైల్డ్‌లైన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. బుధవారం బాలుడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉన్న చైల్డ్‌లైన్ కార్యాలయానికి రావడంతో బాలుడిని చైల్డ్‌లైన్ సభ్యులు బాలల సంక్షేమ కమిటి ముందు ప్రవేశ పెట్టారు. కమిటీ చైర్మన్ ఆదేశానుసారం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వావిలాల లక్ష్మణ్, సభ్యులు పట్నాయక్, చైల్డ్‌లైన్ 1098 సంస్థ కో ఆర్డినేటర్ ఎస్. రంజిత, సతీష్, కృష్ణారావు, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన సవతి తండ్రి
కొయ్యలగూడెం :కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడంటూ జంగారెడ్డిగూడెం రోడ్డులోని 8వ వార్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిపై చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ జేవియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం రోడ్డులో ఎస్బీఐ బ్రాంచి సమీపంలో వెల్డింగ్ షాపు యజమాని పంపాని శేషగిరి 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. షాపు యజమాని తాడేపల్లిగూడెంలో నివసించే సమయంలో సుబ్బమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండేవాడని, ఎనిమిది నెలల క్రితం ఆమె మరణించడంతో ఆమె కుమార్తె, కుమారుడిని కొయ్యలగూడెం తీసుకువచ్చి ఓ అద్దె ఇంటిలో ఉంచినట్టు కో-ఆర్డినేటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడిని తన వెల్డింగ్ షాపులోనే పనికి పెట్టి నిందితుడు తరచూ ఇంటికి వెళ్లి కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడన్నారు. ఈ విషయం స్థానికులు చైల్డ్‌లైన్ సెంటర్‌కు నాలుగు రోజుల క్రితం తెలిపారని, దీంతో చైల్డ్ లైన్ సిబ్బంది కొయ్యలగూడెం వచ్చి అద్దె ఇంటిలో ఉంచిన కుమార్తె వద్దకు వెళ్లి విచారించారన్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె కన్నీళ్ల పర్యంతమై తనకు జరుగుతున్న ఘోరాన్ని వివరించింది. చైల్డ్‌లైన్ కేర్ సిబ్బంది బి.నరేంద్ర, ఎస్.రవిబాబు, ఎస్.సునీత పాల్గొన్నారు. దీనిపై ఎస్సై ఎస్ఎస్ఆర్ గంగాధర్ మాట్లాడుతూ నిందితుడు పంపాని శేషగిరి సుబ్బమ్మకు రెండవ భర్తగా వ్యవహరించాడని, ముందు భర్త పిల్లలు కావడం చేత ఇరువురిపై వేధింపులకు పాల్పడేవాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.