అద్దె భవనాలు...ఇరుకు గదులు
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే ధ్యేయంతో జిల్లాలో ఏర్పాటైన 3,700(మినీ కేంద్రాలతో కలిపి) అంగన్వాడీ కేంద్రాల్లో చాలా కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తోంది. చాలా కేంద్రాలు ఇరుకు గదుల్లోను, 80 శాతం అద్దె భవనాల్లోనూ నడుస్తున్నాయి. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ ఎఈ.రాబర్ట్స్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పట్టణంలోని పలు కేంద్రాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో ఆటలాడించి, పాటలు పాడించారు. కేంద్రాల్లో సమస్యలు గురించి తెలుసుకున్నారు.
పీడీ ఏమన్నారంటే సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా
పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాను. వాటిలో కొన్ని సమస్యలను గుర్తించాను. ప్రధానంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం, గర్భిణుల్లో రక్తహీనత ఉన్నట్టు అర్థమైంది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారికి అదనపు ఆహారాన్ని ఇస్తున్నాం. రక్తం తక్కువగా ఉన్న గర్భిణులను గుర్తించి వారికి కూడా అదనపు పౌష్టికాహారాన్ని , ఐరన్ మాత్రలను అందిస్తున్నాం. అధిక శాతం కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న భవనాల్లోకి మార్చడానికి కృషి చేస్తాను. మొదట పట్టణంలోని కొణిసి వీధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని పీడీ సందర్శించారు. అక్కడ సంభాషణ ఇలా సాగింది.
పీడీ రాబర్ట్స్: అమ్మా మీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చారు?
ఏఎన్ఎం సత్యవతి: సార్ నాపేరు సత్యవతి నేను ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. ఇమ్యునైజేషన్ చేయడానికి వచ్చాను.
రాబర్ట్స్: ఎవరెవరికి టీకాలు వేస్తారు?
సత్యవతి: గర్భిణులు, పిల్లలకు
టీకాలు వేస్తాం.
పీడీ రాబర్ట్స్: అమ్మా నీ పేరేంటి, ఎన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ?
అంగన్వాడీ కార్యకర్త: సార్ నాపేరు ప్రసన్న. నేను ఐదు సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను.
పీడీ రాబర్ట్స్: ఎంతమంది పిల్లలు మీ కేంద్రంలో నమోదు అయ్యారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు?
ప్రసన్న: మా కేంద్రంలో 29 మంది పిల్లలు నమోదు అయ్యారు సార్, ప్రస్తుతం 20 మంది పిల్లలు వచ్చారు
పీడీ రాబర్ట్స్: పిల్లలకు ఏం పెడుతున్నారు?, పిల్లల బరువు తూస్తున్నారా ?
ప్రసన్న: ప్రతీ రోజు భోజనం, వారంలో నాలుగు పర్యాయాలు గుడ్లు పెడుతున్నాం, పిల్లలు అందరికీ బరువు తూస్తున్నాం
పీడీ రాబర్ట్స్: పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలు ఎంతమంది ఉన్నారు?, వారికి అదనంగా ఆహారం అందచేస్తున్నారా ?
ప్రసన్న: ఒకరే ఉన్నారు. సాధారణ పిల్లలు కంటే అదనంగా పౌష్టికాహారం అందజేస్తున్నాను. సాధారణ పిల్లలకు నాలుగు గుడ్లు ఇస్తే, వీరికి ఆరు గుడ్లు ఇస్తాం.
పీడీ రాబర్ట్స్: మీకేమైనా సమస్యలున్నాయా?
ప్రసన్న: అద్దె భవనం కావడం వల్ల ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ భనవం గాని, స్కూలు భవనం గాని ఇప్పించాలి.
పీడీ రాబర్ట్స్: మునిపల్ కమిషనర్‌తో మాట్లాడి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న భవనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
పీడీ రాబర్ట్స్: సీడీపీఓ, సూపర్వైజర్ పర్యవేక్షణకు వస్తున్నారా?, బాల్యవివాహాలపై ప్రచారం చేస్తున్నారా ?
ప్రసన్న: వస్తున్నారు సార్, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వాటి వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నాం సార్
పీడీ రాబర్ట్స్: ఏమ్మా నీపేరేంటి,అంగన్ వాడీ కేంద్రానికి ఎందుకు వచ్చావు?
బాలింత : సార్ నాపేరు గాయత్రి. మా బాబుకి టీకాలు వేయించడానికి వచ్చాను.
పీడీ రాబర్ట్స్ : మీ బాబు బరువు తూస్తున్నారా ? , మీ బాబు పుట్టినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాడు?
గాయత్రి: తూనిక వేస్తున్నారు. మా బాబు పుట్టినప్పుడు రెండున్నర కేజీలు ఉన్నాడు సార్.
పీడీ రాబర్ట్స్ : పాప నీపేరేంటి, నీకు గుడ్లు ఇస్తున్నారా, రుచికరంగా ఉంటున్నాయా ?
అంగన్వాడీ సెంటర్ విద్యార్థిని: నాపేరు నందిని సార్. గుడ్లు పెడుతున్నారు. గుడ్డు బాగుంటుంది.
పీడీ రాబర్ట్స్: ఆటలు ఆడిస్తున్నారా?
నందిని: ఆడిస్తున్నారు సార్
పీడీ రాబర్ట్స్: ఏమ్మా నీపేరేంటి , ఎందుకు వచ్చావు?
గర్భిణి: సార్ నాపేరు అమీబి. టీకాలు వేయించుకోవడానికి వచ్చాను.
పీడీ రాబర్ట్స్: ఎంసీహెచ్ కార్డు ఇచ్చారా, కార్డులో ఏఏ వివరాలు ఉన్నాయి?
అమీబి: ఇచ్చార్ సార్. కార్డులో ఏ నెలలో ఏ టీకాలు వేసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న వివరాలు ఉన్నాయి.
పీడీ రాబర్ట్స్: అమ్మా మీపేరేంటి, ఏం చేస్తుంటారు ?
పట్టణ సీడీపీఓ : సార్ నా పేరు రాజరాజేశ్వరి. నేను పట్ణణ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓగా పనిచేస్తున్నాను.
పీడీ రాబర్ట్స్: నెలలో ఎన్నిసార్లు కేంద్రాలను పర్యవేక్షిస్తారు, మీ పరిధిలో ఎంతమంది సూపర్వైజర్లు ఉన్నారు?
రాజరాజేశ్వరి: నెలలో 20 రోజులు కేంద్రాలను పర్యవేక్షిస్తాం సార్, నా పరిధిలో నలుగురు సూపర్వైజర్లు ఉన్నారు.
పీడీ రాబర్ట్స్: పట్టణ పరిధిలో పౌష్టికాహార లోపంతో ఎందమంది బాధపడుతున్నారు?
రాజరాజేశ్వరి : 154 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు సర్.
పీడీ రాబర్ట్స్: వీరిని సాధారణ స్థితికి తేవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
రాజరాజేశ్వరి: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలును సాధారణ స్థితికి తేవాడానికిఅదనపు పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా ఐరన్ మాత్రలు అందిస్తున్నాం,.
పీడీ రాబర్ట్స్: అమ్మా నీ పేరేంటి, అంగన్వాడీ కేంద్రానికి ఎందుకు వచ్చావు?
బాలింత : సార్ నాపేరు షకీనా. మా పాపకు టీకాలు వేయించడానికి వచ్చాను.
పీడీ రాబర్ట్స్: పుట్టిన ఎంత సేపటికి తల్లిపాలు తాగించాలి?
షకీనా: పుట్టిన గంట లోపు తల్లిపాలు తాగించాలి.
పీడీ రాబర్ట్స్: మీపేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు?
సూపర్వైజర్ : సార్ నాసేరు కుసుమకుమారి. నేను 11 సంవత్సరాలుగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాను.
పీడీ రాబర్ట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు తీసుకున్నారు కదా, ఏయే సేవలకు అవార్డు ఇచ్చారు?
కుసమకుమారి: బాల్య వివాహాలను నిలుపుదల చేసినందుకుగాను, పౌష్టికాహారలోపాన్ని నివారించినందుకు గాను అవార్డు ఇచ్చారు
పీడీ రాబర్ట్స్: మరుగుదొడ్ల వినియోగం ఏవిధంగా ఉంది?
కుసమకుమారి: మరుగుదొడ్ల వినియోగం బాగానే ఉంది.
అనంతరం బూడివీధిలోని
అంగన్వాడీ కేంద్రాన్ని పీడీ సందర్శించారు
పీడీ రాబర్ట్స్: అమ్మా నీపేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు?
అంగన్వాడీ కార్యకర్త : సార్ నాపేరు రమాదేవి. నేను 11 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను.
పీడీ రాబర్ట్స్: ఎంతమంది పిల్లలు నమోదయ్యారు, ఎంతమంది వచ్చారు?
రమాదేవి: 22 మంది పిల్లలకు గాను 18 మంది పిల్లలు వచ్చారు సార్.
పీడీ రాబర్ట్స్: మిగతా నలుగురు పిల్లలు ఎందుకు రావడం లేదు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారా?
రమాదేవి: ఒకో రోజు వస్తున్నారు. ఒకోరోజు రావడం లేదు. పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను.
పీడీ రాబర్ట్స్: గృహ సందర్శనకు వెళుతున్నారా ?
రమాదేవి: గృహ సందర్శనకు వెళుతున్నాను సార్, గర్భస్థ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నాం.
పీడీ రాబర్ట్స్: అమ్మా నీపేరేంటి, మీ వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని రోజూ తెరుస్తున్నారా ?
బాలింత : సార్ నాపేరు సునీత, మా వీధిలో అంగన్వాడీ కేంద్రం రోజూ తీస్తున్నారు సార్.
పీడీ రాబర్ట్స్: పౌష్టికాహారాన్ని పూర్తి స్థాయిలో ఇస్తున్నారా, లేక కోత విధిస్తున్నారా?
సునీత: పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. కోత విధించడం లేదు.
పీడీ రాబర్ట్స్: మీపేరేంటి టీకాలు సకాలంలో వేస్తున్నారా?
గర్భిణి : సార్ నాపేరు రమాదేవి. టీకాలు సకాలంలో వేస్తున్నారు
పీడీ రాబర్ట్స్: పౌష్టికాహారం కేంద్రంలో ఇస్తున్నారా, ఇంటికి ఇస్తున్నారా?
రమాదేవి: కేంద్రంలోనే పెడుతున్నారు.