మనం కంచె వేసుకుంటే.. చైనాకు నొప్పేంటి?
భారత్ - పాకిస్థాన్ వ్యవహారంలో వేలు పెట్టడాన్ని చైనా ఇంకా మానుకోవడం లేదు. పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దులను మనం మూసుకుంటే అది తప్పని ఆ దేశం అంటోంది. దానివల్ల భారత్-చైనా సంబంధాలు మరింత పాడవుతాయని చెప్పింది. భారతదేశం చాలా అహేతుకమైన నిర్ణయం తీసుకుంటోందని, ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత దానిపై ఇంతవరకు దర్యాప్తు కూడా మరీ గట్టిగా ఏమీ జరగలేదని, అలాగే ఆ దాడి వెనుక పాక్ హస్తం ఉందనడానికి సాక్ష్యం కూడా ఏమీ లేదని షాంఘై అకాడమీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కు చెందిన హు జియాంగ్ వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న మొత్తం 3.323 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును 2018 డిసెంబర్ నాటికి పూర్తిగా మూసేస్తామంటూ భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిచంఆరు.
ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్యం అంతంతమాత్రంగా ఉందని, ఇప్పుడు సరిహద్దులను మూసేస్తే ఇది మరింత ప్రభావితం అవుతుందని ఆయన చెప్పారు. సరిహద్దులను మూసేయడం వల్ల ఇరుదేశాల మధ్య శాంతి ప్రయత్నాలకు మరింత విఘాగం కలుగుతుందని షాంఘై మునిసిపల్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సదరన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ వాంగ్ డెహువా వ్యాఖ్యానించారు. భారత నిర్ణయాన్ని బట్టి చూస్తే ఇప్పటికే పరోక్ష యుద్ధం ఉందన్న జాడలు కనిపిస్తున్నాయని, సరిహద్దు మూత వల్ల కశ్మీర్ వాసులలో మరింత విద్వేషభావాలు చెలరేగుతాయని అన్నారు.
చైనాకు పాకిస్థాన్ ఎప్పటికీ వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి, భారత దేశం తీసుకుంటున్న నిర్ణయం వల్ల భారత్ - చైనా - పాక్ సంబంధాలు మరింత సంక్లిష్టం అవుతాయని హు జియాంగ్ తెలిపారు. కశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుక్కుంటే అది చైనాకు కూడా మంచిది అవుతుందన్నారు. త్వరలో గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సులో ప్రధాన నరేంద్రమోదీతో పాటు కలిసి పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వస్తున్న నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు రావడం గమనార్హం.