ఇసుక తోడేళ్లు
- చిన్న హగిరిలో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులు
- ప్రతిరోజుకు 40 ట్రాక్టర్ల ఇసుక దోపిడీ
- చోద్యం చూస్తున్న అధికారులు
డి.హీరేహాళ్ : చిన్న హగిరి ఒకప్పుడు ప్రతి ఒక్కరికి సెలయేరు. మూడు అడుగులు తవ్వితే నీళ్లు ఉబికేవి. అయితే ప్రస్తుతం ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో ఉన్న నీరు కూడా ఆవిరైంది. చిన్న హగిరికి ఇరువైపున ఉన్న పొలాల్లో 100 అడుగుల లోపే నీరు సమృద్ధిగా ఉండటంతో పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉండేవి. గొర్రెలు, పశువుల కాపరిలకు కూడా ఇబ్బందులు ఉండేవి కావు. కాని నేడు ఇక్కడున్న ఇసుక కర్ణాటకకు తరలిస్తుండటంతో కనుచూపు మేరలో పచ్చని పొలాలు కనిపించవు. పల్లెల్లో పది మందికి అన్నం పెట్టె రైతులు నేడు బోరు బావుల్లో నీరు లేకపోవడంతో పంట పొలాలను బీళ్లుగా వదిలేసి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిపోయారు.
కాసులు కురిపిస్తున్న ఇసుక
ఇసుక... కాసుల వర్షం కురుపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డంగా ఇసుకను తోడేస్తున్నారు. రోజుకు 30 నుండి 40 ట్రాక్టర్లు ఇసుకను ఇక్కడి నుంచి అక్రమంగా తరలిపోతోంది. ప్రస్తుతం బాదనహాళ్, చెర్లోపల్లి, మైలాపురం నుండి ఇసుకను దర్జాగా ట్రాక్టర్లలో తరలిస్తూ కర్ణాటక సరిహద్దుల్లో నిలువ చేసి రాత్రికి రాత్రి బెంగళూరుకు తీసుకెళ్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కర్ణాటకలోనే డంప్
ఓబుళాపురం సరిహద్దు ప్రాంతాల్లో నిలువ చేసేందుకు కూడా ఒక రెవెన్యూ అధికారికి కర్ణాటకలోని ఒక ఇసుక మాఫీయా లీడర్ లక్షల్లో ముట్టచెప్పారన్న ఆరోపణలున్నాయి. ఓబుళాపురం సమీపంలోని కర్ణాటక సరిహద్దున, సోమలాపురం సమీపంలో ఉన్న కరిడిపల్లి వద్ద ఇసుకను డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఇసుక కర్ణాటక సరిహద్దుల్లో చేరవేస్తే రూ.5 వేలు ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌తో రోజుకు 6 నుండి 8 ట్రిప్పుల ఇసుకను తీసుకెళ్తున్నారు.
అన్నీ గుంతలే..
ఓబుళాపురం, డి.హీరేహాళ్, గ్రామాల వారే ఈ ఇసుకను రవాణా చేస్తున్నారు. మా గ్రామ సమీపంలో ఇసుక ఉన్నా మేముందుకు ఇసుక రవాణా చేయకూడదంటూ కొంతమంది అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుతం చిన్న హగరిలో 30 నుండి 40 గోతులు తవ్వడంతో హగరి పక్కన ఉన్న పంట పొలాలు బీళ్లుగా మారాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకొంటే తప్ప ఇసుక తరలింపు ఆగని పరిస్థితి ఉంది.
పట్టించుకునేవాళ్లు లేరు
– పరమేశ్వరప్ప, బాదనహాళ్
నాకు 16 ఎకరాలు భూమి ఉంది. ఒకప్పుడు నీరు సమృద్ధిగా ఉండేది. ప్రస్తుతం బోర్లలో నీరు రాకపోవడంతో రెండు ఎకరాలకు కూడా నీరు చాలడం లేదు. చిన్న హగరిలో ఇసుక తరలిపోతుండటంతో బోర్లలో రోజురోజుకు నీళ్లు తగ్గిపోతున్నాయి. అధికారులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
అభివృద్ధి పనులకు మాత్రమే అనుమతి
– ఖతిజిన్ ఖుప్రా, తహసీల్దార్
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు మాత్రమే ఇసుక తరలింపునకు అనుమతిస్తున్నాం. కర్ణాటకకు ఇసుకను తరలిస్తూ పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రస్తుతం గత వారం రోజులుగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల వివరాలు, నెంబర్లు నోట్ చేసుకున్నాం. రాత్రి వేళలో సిబ్బందితో నిఘా ఉంచుతున్నాం.