బీసీల అభివృద్ధికి అధిక నిధులివ్వండి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ నేతల వినతి
సాక్షి, హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీవర్గాల అభివృద్ధికోసం కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసినా, సరిపడా నిధులివ్వక బీసీ వర్గాలు అభివృద్ధిని సాధించలేక పోయారని, కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా బీసీ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు సీఎం కే సీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, రాష్ట్ర చేతివృత్తుల కమిటీ ఛైర్మన్ వన్నాల శ్రీరాములు తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు.
కార్పొరేషన్లకు కమిటీలను నియమించడంతోపాటు, ఒక్కో కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆయా కులాలను ఆదుకోవాలని కోరారు. చేనేత బోర్డుకు అప్పుల మాఫీ కింద రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. ఆయా ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సరఫరా, రాజీవ్ విద్యామిషన్ పనులన్నింటినీ ఆప్కోకు కేటాయించాలని కోరారు. అన్నివృత్తుల వారికి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.