వైఎస్సార్సీపీ నేతపై చింతమనేని దాష్టీకం
సాక్షి, దెందులూరు : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి దాష్టీకానికి దిగారు. పోలవరం కాలువపై జరుగుతున్న మట్టి రవాణాపై ఫిర్యాదు చేశాడనే అక్కసుతో.. వైఎస్సార్సీపీ నేత మేడికొండ కృష్ణపై హత్యాయత్నం చేశారు. కృష్ణను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి తీసుకెళ్తూ...కారులోనే తీవ్రంగా కొట్టారు. అనంతరం కృష్ణను రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. ఇంతటి దారుణానికి పాల్పడి కూడా.. కృష్ణపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ ఎమ్మెల్యే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెదవేగి పోలీసు స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. చింతమనేని, టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గార్లమడుగు మాజీ సర్పంచ్ అయిన మేడికొండ కృష్ణ లక్ష్మీపురం వద్ద పోలవరం కాలువపై మట్టి అక్రమ తవ్వకాలపై ఇటీవల అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన చింతమనేని అనుచరులు రెండు కార్లలో వచ్చి ఆయనపై దాడికి దిగారు. అనంతరం అదే కారులో దుగ్గిరాలలోని ఎమ్మెల్యె చింతమనేని ఇంటికి తీసుకెళ్లి.. అక్కడ నుంచి కొట్టుకుంటూ కారులో ఊరంతా తిప్పారు. అనంతరం రోడ్డుపక్కన కృష్ణను విసిరేశారు. కృష్ణ రక్తమోడుతున్న శరీరంతోనే పెదవేగి పోలీసులకు ఈ దుర్మార్గంపై ఫిర్యాదు చేశారు. కృష్ణకు మద్దతుగా దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, పార్టీ శ్రేణులు పెదవేగి పోలీసు స్టేషన్కి చేరుకొని ఆందోళనకు దిగారు. కృష్ణపై దాడి ఘటనలో ఎమ్మెల్యే చింతమనేనితోపాటు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలంటూ వారు పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు.
ఎట్టకేలకు ఎఫ్ఐఆర్
వైఎస్సార్ సీపీ ఆందోళనతో పెదవేగి పోలీసులు ఎట్టకేలకు నేత ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. 248/18గా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 341, 363, 323,324, 379 రెడ్ విత్ 34గా కేసు నమోదు చేశారు. ఎ2 గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎ1 గా చింతమనేని ప్రధాన అనుచరుడు గద్దే కిషోర్, ఎ3గా ఎమ్మెల్యే గన్మెన్లను పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో వైఎస్సార్ సీపీ నాయకులు ధర్నా విరమించారు.