సృజనకు వేళాయె!
– నేడు జిల్లాస్థాయి ‘ఇన్స్పైర్’ ప్రారంభం
– చర్చి స్కూల్లో ఏర్పాట్లు సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాస్థాయి ఇన్స్పైర్–16 బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం విద్యాశాఖ స్థానిక రెవిన్యూ కాలనీలోని చర్చి పాఠశాలలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసింది. అవార్డు మొత్తం రూ.5 వేలు జమ అయిన 170 మంది విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో అనంతపురం విద్యా డివిజన్ నుంచి 26 మంది, గుత్తి నుంచి 52, ధర్మవరం నుంచి 62, పెనుకొండ నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ లక్ష్మీవాట్స్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
170 ప్రదర్శనలతోనే సరిపుచ్చుకోవాల్సిన దుస్థితి
ఈ విద్యా సంవత్సరం (2016–17) ఇన్స్పైర్ అవార్డులకు జిల్లాలోని వివిధ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 2,256 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకున్నారు. అయితే వీరిలో 833 మందిని జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపిక చేశారు. వీరందరూ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వివరాలను అధికారులకు పంపారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు ప్రకారం రూ.41.65 లక్షలు నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం కేవలం 170 మంది విద్యార్థుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.8.5 లక్షలు జమ చేసింది. తక్కిన విద్యార్థులకు మొండి చేయి చూపింది.