citylus
-
పెళ్లి ముస్తాబుతో దర్పంగా నడుస్తున్న ‘గుర్రాలు’
గోల్కొండ కోట దర్వాజాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆ వీధి రెండు వైపులా ప్రజలు నిలబడి పెళ్లి ఊరేగింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో బారాత్ వచ్చేసింది... అందమైన అలంకారం.. ముత్యాల హారాలు.. ఖరీదైన వస్త్రాలు.. పెళ్లి ముస్తాబుతో దర్పంగా నడుస్తున్న ‘గుర్రాలు’! ఇది 1592 సమయంలో మాట. అప్పట్లో. 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గోల్కొండ పట్టణం 30 వేల జనాభాతో కిటకిటలాడుతుండేది. కానీ మనుషుల కంటే గుర్రాల సంఖ్యే అధికం. రాచఠీవీకి దర్పంగా నిలిచే గుర్రాలను పెంచుకోవటం అప్పట్లో సర్వసాధారణం. గుర్రం లేని ఇళ్లంటే చిన్నచూపే. ఇక శుభకార్యాలు జరిగితే గుర్రాలను అందంగా తీర్చిదిద్దేవారు. వాటికి స్నానం చేయించి, ముత్యాలతో ఘనంగా అలంకరించేవారు. మామూలు గుర్రాల కంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న వాటిని పెంచుకోవటం ఓ గొప్ప గౌరవంగా భావించేవారు. అలాంటి మేలు జాతి గుర్రాలపై ఊరేగటమంటే పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ముఖ్యంగా పెళ్లికొడుకులను అలాంటి గుర్రాలపై మాత్రమే వేదిక వద్దకు తీసుకువచ్చేవారు. గోల్కొండ పరిధి విస్తరించి వెలుపల నగరం రూపుదిద్దుకున్న తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వచ్చింది. కుతుబ్‌షాహీల జమానా ముగిసి అసఫ్‌జాహీల హయాం మొదలైన తర్వాత ఈ సంప్రదాయం సాధారణ ఇళ్లకూ పాకింది. గుర్రాల సందడి లేకుండా శుభకార్యం జరిగేది కాదు. మేలు జాతి గుర్రం అప్పట్లో స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అలా మొదలైన సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా పెళ్లి వేడుకల్లో గుర్రాలను వినియోగిస్తున్నారు. బారాత్‌లో గుర్రం లేకుండా పెళ్లి కుమారుడి కుటుంబం ముందుకు సాగదు. తరతరాల వృత్తి... శతాబ్దాలు దొర్లిన తర్వాత కూడా గుర్రాల ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. అయితే సొంతంగా ప్రతి ఇంటా గుర్రాల పెంపకం అంతరించినా... పెళ్లింట మాత్రం వాటి సందడి ఉండాలని కోరుకునే కుటుంబాలకు కొదవ లేదు. పెళ్లి రోజు మాత్రం గుర్రాలను తీసుకొచ్చి ఎదుర్కోళ్లు, ఊరేగింపు ఢనిర్వహిస్తున్నారు. ఇలాంటి అవసరాలను తీర్చేందుకు పాతనగరంలో కొన్ని కుటుంబాలు సిద్ధంగా ఉంటాయి. మేలు జాతి గుర్రాలు, అందమైన ్ఢబగ్గీలను వీరు సరఫరా చేస్తున్నారు. పురానాపూల్, జుమ్మేరాత్ బజార్లలో 30 వరకు ఇలాంటి కుటుంబాలున్నాయి. మూడునాలుగు తరాలుగా ఈ కుటుంబాలు గుర్రాల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుతుబ్‌షాహీల కాలంలో గుర్రాలను పెంచే వ్యాపకంలో ఉన్నవారు కాలక్రమంలో గుర్రాలు, బగ్గీలను అద్దెకిచ్చి అదే వృత్తిగా మలచుకున్నారు. క్యాబ్ అద్దెకు తీసుకుంటే కిలోమీటర్ల వారీగా వసూలు చేసిన త రహాలోనే గుర్రాలకు, బగ్గీలకూ ధర ఉంది. నగరంలోని 15 కి.మీ. పరిధిలో గుర్రపు బగ్గీలను తిప్పితే రూ.6 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎదుర్కోళ్లలో భాగంగా పెళ్లి కుమారుడిని వివాహవేదిక వద్దకు తీసుకురావటానికి గుర్రాన్ని పంపితే రూ.3 వేల వరకు వసూలు చేస్తారు. ఇక గుర్రాలకు తోడుగా అదనపు ఆకర్షణగా కొందరు ఒంటెలనూ బారాత్‌లలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం కొన్ని కుటుంబాలు ఒంటెలనూ పెంచుతున్నాయి. -
రిక్రూటర్‌ను మెప్పించే రెజ్యుమె ఇలా!
జాబ్ స్కిల్స్: ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడగానే అభ్యర్థులు చేసే పని.. తమ వివరాలతో కూడిన రెజ్యుమెను రూపొందించుకొని, సంస్థకు పంపించడం. ఇంటర్వ్యూ పిలుపు కోసం ఎదురుచూడడం. రెజ్యుమె దశనుంచే వడపోత కొనసాగుతుంది. ఆకర్షణీయంగా లేని వాటిని రిక్రూటర్లు పక్కనపెడతారు. తమకు నచ్చిన రెజ్యుమెల అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. కొలువు వేటలో అత్యంత కీలకమైంది.. రెజ్యుమె. పర్ఫెక్ట్ రెజ్యుమె అనేదానిపై రిక్రూటర్ల అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చు. వ్యక్తులను బట్టి దృష్టికోణం మారుతుంది. ఒక్కో రెజ్యుమెపై సంస్థ యాజమాన్యాలు వెచ్చించే సమయం సగటున కేవలం 6 సెకండ్లేనని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యవధిలోనే అభ్యర్థులు తగిన వారా? కాదా? అనే విషయం తేల్చేస్తారు. కాబట్టి తక్కువ సమయంలోనే రిక్రూటర్‌ను కట్టిపడేసే రెజ్యుమెను తయారు చేసుకుంటే ఇక తిరుగుండదు. ఇందులో ఎలాంటి పదాలు వాడాలి. ఎలాంటి పదాలు వాడకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాడాల్సిన పదాలు కంపెనీ యాజమాన్యం దృష్టిని వెంటనే ఆకర్షించే పదాలు కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకొని, రెజ్యుమెలో ఉపయోగించాలి. ఎక్స్‌పీరియెన్స్, మేనేజ్మెంట్, ప్రాజెక్ట్, డెవలప్మెంట్, బిజినెస్, స్కిల్, ప్రొఫెషనల్, నాలెడ్జ్, టీమ్, లీడర్షిప్ వంటి పదాలతో కూడిన రెజ్యుమెలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు సర్వేలో స్పష్టమైంది. సాధారణ రెజ్యుమెల కంటే ఇవి రిక్రూటర్‌ను 70 శాతం అధికంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది. వాడకూడని పదాలు యాజమాన్యాలకు నచ్చని పదాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు వాటిని పరిహరించడమే మంచిది. మీ, మైసెల్ఫ్, నీడ్, ఛాన్స్, హార్డ్, ఫస్ట్, లెర్నింగ్ వంటి పదాలున్న రెజ్యుమెలను రిక్రూటర్లు పక్కనపడేస్తున్నారని సర్వేలో బయటపడింది. ఇలాంటి రెజ్యుమెలు 79 శాతం తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని స్పష్టమైంది. ఉద్యోగాల సాధనలో ఇవి ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. వేటిని చేర్చాలి? రెజ్యుమె నిర్మాణాత్మకంగా ఉండడానికి, ప్రొఫెషనల్‌గా కనిపించడానికి అందులో కొన్ని విభాగాలను తప్పనిసరిగా చేర్చాలి. ఆబ్జెక్టివ్, సమ్మరీ, వర్క్ హిస్టరీ, ట్రైనింగ్, అఛీవ్మెంట్స్ వంటి వాటిని పొందుపర్చాలి. దీనివల్ల అభ్యర్థులకు అవకాశాలు మెరుగవుతాయి. చేర్చకూడనివి పాతకాలం రెజ్యుమెల్లో కొన్ని విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించేవారు. ఇప్పుడు ఇలాంటి వాటికి యాజమాన్యాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలిసిన భాషలు, వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచుల గురించి ప్రస్తావించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని రెజ్యుమెలో చేర్చకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి వాటితో కూడిన రెజ్యుమెలో రిక్రూటర్‌ను 24 శాతం తక్కువగా మెప్పిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.