పండుగ పూట పస్తులు తప్పవా?
- హోంగార్డు వేతనాలకు బడ్జెట్ లేదట!
- జూలైలో 10 రోజుల జీతం పెండింగ్‌లో..
- ఆగస్టులోనూ అందని వేతనం
- కష్టాల్లో హోంగార్డులు
- దసరా వరకైనా అందేనా?
నిజామాబాద్ క్రైం : సివిల్ పోలీసులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాలు అందక వారు అష్టకష్టాలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే దసరా పండగ ఎలా జరుపుకోవాలని ఆందోళన చెందుతున్నారు. హోంగార్డులకు నెలకు రూ. 9 వేల వేతనం చెల్లిస్తున్నారు. అయితే బడ్జెట్ లేదన్న సాకుతో పూర్తి వేతనాన్ని ఒకేసారి కాకుండా ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ కూడా భారమవుతోందని పలువురు హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, రేషన్ సామగ్రి, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. బడ్జెట్ లేదన్న సాకుతో వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.
వేతనం పెరిగినా..
జిల్లాలో ప్రస్తుతం 936 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వారంతా చాలీచాలని వేతనాలతో అనేక ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ధరల పెరుగుదలతో తమకిస్తున్న రోజుకు రూ. 200 వేతనం సరిపోవడం లేదని, వేతనాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. మూడు నెలల క్రితం వారి వేతనాన్ని రూ. 300లకు పెంచింది. నెలకు రూ. 9 వేల వేతనం వస్తుందని హోంగార్డులు సంతోషించారు. కానీ వేతనం పెరిగినా.. సరిగా అందక వారు ఇబ్బందులు పడుతున్నారు.
వేతనాలు చెల్లించారిలా
ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేకపోవడంతో జూన్ నెల వేతనం రూ. 9వేలకుగాను రూ. 3,900 మాత్రమే చెల్లించింది. జూలైలో జీతం ఇవ్వలేదు. ఆగస్టులో జూన్‌కు సంబంధించిన పెండింగ్ వేతనాన్ని ఇచ్చింది. జూలైకి సంబంధించి 20రోజుల వేతనం రూ. చెల్లించింది. మరో పదిరోజుల వేతనాన్ని పెండింగ్‌లో పెట్టింది. అప్పటినుంచి ఒక్కపైసా ఇవ్వలేదు.
గతంలో ఎస్పీగా పనిచేసిన రాజేశ్ కుమార్ తమకు వేతనాలు సక్రమంగా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నారని, ఆయన తర్వాత వచ్చినవారు సరైన శ్రద్ధ చూపడం లేదని హోంగార్డులు వాపోతున్నారు. క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.