నేడు సివిల్స్ ప్రిలిమినరీ
► హాజరుకానున్న 3,537 మంది అభ్యర్థులు
► తొమ్మిది కేంద్రాల్లో పరీక్ష
► నిర్వహణకు 338 మంది సిబ్బంది
అనంతపురం అర్బన్ : యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. తొమ్మిది కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 3,537 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు 338 మంది సిబ్బందిని నియమించారు. 306 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రం ఉన్న కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆయా కేంద్రం వెన్యూ సూపర్వైజర్ ఉంటారు. రూట్ కమ్ స్పెషల్ ఆఫీసర్లుగా తొమ్మిది మందిని, లైజనింగ్ అధికారులుగా తొమ్మిది మందిని, అసిస్టెంట్ సూపర్వైజర్లుగా తొమ్మిది మందిని నియమించారు. పరీక్షకు హాజరవుతున్న 26 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకంగా ఎస్ఎస్బీఎన్ జూనియర్ కళాశాలలో కేంద్రం ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్
సమస్యలు ఉంటే అభ్యర్థులు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08554–275811కి పోన్ చేసి చెప్పవచ్చు. ఇతర సమాచారం కావాలంటే 011–23385271, 011–23381125, 011–23098543 నెంబర్లలో లేదా ఠీఠీఠీ.upటఛి.జౌఠి.జీn సంప్రదించవచ్చు.
పరీక్ష కేంద్రాలు ఇవే
జేఎన్టీయూ (సెంటర్–ఎ), జేఎన్టీయూ (సెంటర్–బి), కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల, ఎస్ఎస్బీఎన్ జూనియర్ కళాశాల, కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్ కళాశాల, కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎస్కేయూ), ప్రభుత్వ జూనియర్ కళాశాల.
గంట ముందే చేరుకోవాలి
పరీక్ష కేంద్రాలకు నిర్దేశించిన సమయానికి కంటే గంట ముందుగానే అభ్యర్థులు చేరుకోవాలని అధికారులు తెలిపారు. పేపర్–1 ఉదయం 9.30 గంటలకు నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. బ్లాక్ పాయింట్ పెన్ని మాత్రమే వాడాలి.
వీటిని అనుమతించరు
మొబైల్ ఫోన్లు, పేజర్లు, బ్లూటూత్, క్యాలికులేటర్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు, స్పైకెమెరా, పుస్తకాలు, ఎటువంటి కమ్యునికేషన్ పరికాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అధికారులు, ఇన్విజిలేటర్లు, పర్యవేక్షకులు, ఇతర అధికారులు కూడా మొబైల్ ఫోన్లను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు.