ఇంటి దొంగలపై సింగరేణి విజిలెన్స్ విచారణ
► ఒకరి సస్పెన్షన్... రికార్డులు స్వాధీనం
► పక్కదారిపడుతున్న నల్ల బంగారం
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణి బొగ్గు పక్కదారి పడుతున్న సంఘటన ఇటీవల వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం ఇంటి దొంగలపై విచారణ ప్రారంభించింది. రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1 డివిజన్లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు నుంచి ఆర్జీ-1 సీహెచ్‌పీ వరకు ప్రతీ రోజు బొగ్గును టిప్పర్ల ద్వారా రవాణా చేస్తారు. ఓసీపీ నుంచి సీహెచ్‌పీకి చేరుకున్న తర్వాత అక్కడ బంకర్లో బొగ్గు పోస్తే దానిని రైలు వ్యాగన్లో వినియోగదారులకు పంపిస్తారు. అయితే మేడిపల్లి ఓసీపీలో బొగ్గును టిప్పర్‌లో నింపుకున్న తర్వాత అక్కడే ఉన్న ఎస్అండ్పీసీ చెక్‌పోస్టు వద్ద అవుట్ స్లిప్ తీసుకోవాలి. తిరిగి సీహెచ్‌పీకి టిప్పర్ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న మరో ఎస్అండ్పీసీ చెక్‌పోస్టు వద్ద ఇన్స్లిప్ తీసుకుంటారు.
అక్కడికి కొద్దిదూరంలో ఉన్న సీహెచ్‌పీ బంకర్ వద్దకు వెళ్లి బొగ్గును అన్లోడ్ చేయగా... టిప్పర్ వచ్చి అన్లోడ్ చేసినట్టు మొకద్దాం (సూపర్వైజర్) బుక్‌లో నమోదు చేస్తాడు. మళ్లీ టిప్పర్ సీహెచ్‌పీ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద అవుట్, మేడిపల్లి ఓసీపీ వద్ద గల చెక్‌పోస్టులో ఇన్ పడాలి. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
అసలేం జరిగింది...?
మార్చి 30న రాత్రి షిప్టులో బర్ల సదయ్యకు చెందిన (ఏపీ 15టిబి 9099 ) టిప్పర్‌ను బొగ్గు లోడుతో మేడిపల్లి ఓసీపీ నుంచి ఆర్జీ-1 సీహెచ్‌పీకి డ్రైవర్ రేగుల లక్ష్మణ్ మొదటి ట్రిప్ తీసుకెళ్లాడు. రెండో ట్రిప్‌లో భాగంగా రాత్రి 1.50 గంటలకు బొగ్గు లోడ్ చేసుకుని మేడిపల్లి ఓసీపీ ఎస్అండ్పీసీ చెక్‌పోస్టు వద్ద అవుట్ స్లిప్ రాయించుకున్నాడు. తిరిగి తెల్లవారుజామున 4.30 గంటలకు మేడిపల్లి ఓసీపీకి ఖాళీ టిప్పర్‌తో వచ్చాడు. అక్కడ డ్యూటీలో ఉన్న గణేశ్ అనే సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చి స్లిప్ పరిశీలించడంతో అసలు నిజం వెలుగుచూసింది. స్లిప్‌లపై ఫోర్జరీ సంతకాలు చేసి బొగ్గును దారి మళ్లించినట్టు గుర్తించాడు.
సీహెచ్‌పీ వద్ద చెక్‌పోస్టులో ఎలాంటి రికార్డు నమోదు కాకపోగా... దానికంటే ముందున్న బంకర్ వద్ద బొగ్గు అన్లోడ్ అయినట్టు అక్కడి సూపర్వైజర్ సంతకం చేసినట్టు ఉంది. ఈ ఘటనలో ఇంటిదొంగల పాత్ర ఉన్నట్టు గుర్తించిన యూజమాన్యం విజిలెన్స్ అధికారులను రంగంలోకి దించింది.
ఇటుక బట్టీలకు బొగ్గు విక్రయం?
మార్చి 30న రాత్రి షిఫ్టులో 1.50 గంటలకు మేడిపల్లి ఓసీపీ చెక్‌పోస్టు నుంచి బయలుదేరిన బొగ్గు టిప్పర్ తెల్లవారుజామున 4.30 గంటలకు రాగా... సుమారు మూడు గంటల సమయం ఆ టిప్పర్ ఎటు వెళ్లిందనే విషయమై విచారణ జరుపుతున్నారు. మేడిపల్లి నుంచి సీహెచ్‌పీకి వెళ్లకుండా నేరుగా రాజీవ్ రహదారిపైకి చేరుకుని పెద్దపల్లి దర్గా సమీపంలోని ఇటుకబట్టీల వద్ద ఈ బొగ్గును అన్లోడ్ చేసినట్టు సమాచారం.
ఈ అనుమానంతో సింగరేణి సెక్యూరిటీ అధికారులు రామగుండం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో టిప్పర్ యజమానితోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్జీ-1 సీహెచ్‌పీ వద్ద బొగ్గు అన్లోడ్ చేయకపోయినా... చేసినట్టు నమోదు చేసిన సూపర్వైజర్ తిరుపతిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కొత్తగూడెం నుంచి వచ్చిన విజిలెన్స్ విభాగం అధికారులు గడిచిన మూడు నెలలుగా బొగ్గు రవాణాకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని అనుమానితులందరినీ విచారణ చేస్తున్నారు.
ఆచూకీ లేని మరో టిప్పర్?
మార్చి 30న రాత్రి మూడో ట్రిప్పులో భాగంగా మేడిపల్లి ఓసీపీ నుంచి బొగ్గు లోడుతో బయటకు వెళ్లిన ఏపీ 15 ఎక్స్ 5679 నంబర్ టిప్పర్ కూడా సీహెచ్‌పీకి కాకుండా బయటకు వెళ్లింది. ఒక టిప్పర్‌ను సెక్యూరిటీ గార్డులు పట్టుకోవడంతో రెండో టిప్పర్ మేడిపల్లి ఓసీపీకి చేరుకోలేదు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆ టిప్పర్ ఆచూకీ లభించలేదు. దీంతో ఇటు సింగరేణి విజిలెన్స్ అధికారులు, అటు పోలీస్ అధికారులు బొగ్గుమాయం ఘటనపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇందులో మేడిపల్లి ఓసీపీ, ఆర్జీ-1 సీహెచ్‌పీ అధికారుల ప్రమేయం ఉందా? ఈ దందా ఎన్నేళ్లుగా సాగుతోంది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.