క్వీన్ బీ
నాన్న కాఫీతోటలు పెంచారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ చేదును వద్దనుకున్నారు ఛాయా నంజప్ప. కూర్గ్ కాఫీ గింజల వైపు చూడకుండా, ఆ ప్రాంతంలోని చెట్లకు కనిపించే తేనెతుట్టెల్ని ఉపాధిగా చేసుకున్నారు. ఆ తియ్యదనాన్ని ఆ ప్రాంతంలోని మహిళలకూ పంచుతున్నారు. క్వీన్ బీ అంటే.. తేనెటీగల్లో రాణి. ఆ రాణిగారు పని చేయరని అంటారు! కానీ.. ఛాయా నంజప్ప అనే ఈ క్వీన్ బీ... తను కష్టపడి, కష్ట జీవులకు మకరందాన్ని పంచుతున్నారు.
‘‘ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండే తేనెటీగలే మాకు స్ఫూర్తి. మేమంతా ఎంత శ్రమ పడినప్పటికీ ఆ శ్రమ.. ఐదు మిల్లీగ్రాముల మకరందాన్ని సేకరించడానికి ఒక తేనెటీగ పడే శ్రమకంటే తక్కువే’’ అంటారు ఛాయా నంజప్ప. ఆ స్ఫూర్తితోనే పని చేశారు కాబట్టే ఈ రోజు ఏడాదికి పది కోట్ల రూపాయల టర్నోవర్‌తో ‘నెక్టార్ ఫ్రెష్’ కంపెనీని నిర్వహిస్తున్నారామె. ‘నెక్టార్ఫ్రెష్’.. స్వచ్ఛమైన తేనె, జామ్‌లను దేశంలోని పెద్ద పెద్ద హోటళ్లకు సరఫరా చేస్తుంటుంది. ఛాయానంజప్ప గత పదేళ్ల శ్రమకు ఫలితమిది.
ఎత్తుపల్లాల ప్రయాణం
ఛాయాకు పారిశ్రామిక రంగంతో ఎటువంటి పరిచయమూ లేదు. ఇంట్లో కూడా ఎవరూ ఆ రంగంలో లేరు. వారి కుటుంబంలో తొలి తరం వ్యాపారి ఆమే. అవాంతరాలు అనుభవంలోకి వచ్చాక వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఆమె చేసింది. దాంతో కంపెనీ ’బ్రేక్ ఈవెన్’ కి రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ లోపు వచ్చిన ఆర్థిక నష్టం చాలా పెద్దదే. అయితే ఆ పాఠాలేవీ వృథాగా పోలేదంటారామె.
కాలం కదులుతోంది
కర్ణాటక రాష్ట్రం, కొడగు దగ్గర నల్కెరీ.. ఛాయా సొంతూరు. కాఫీ తోటల పెంపకంలో తండ్రి సంపాదన కుటుంబాన్ని నడిపిస్తోంది. హెడ్మాస్టర్గా తల్లి జీతం సౌకర్యవంతమైన జీవితాన్నిస్తోంది. ఇది ఆమె స్కూల్ ఫైనల్ వరకు సాగిన జీవితం. తర్వాత రెండేళ్లలో కుటుంబ చిత్రం పూర్తిగా మారిపోయింది. తండ్రి పోవడంతో ఆమె చదువు పన్నెండవ తరగతితో ఆగిపోయింది. కొన్నేళ్లు ఇంటి దగ్గరే ఉండిపోయిన ఛాయాకు కాలంతోపాటు మనిషి ఏదో ఒక వైపు సాగిపోతుండాలనీ, స్తబ్దుగా అయిపోకూడదనీ అనిపించింది. వెంటనే బెంగళూరు ప్రయాణ æమైంది. మొదట ఒక చిన్న ఆఫీస్‌లో రిసెప్షన్ ఉద్యోగం, తర్వాతి ఏడాదికి పెద్ద ఫైవ్‌స్టార్ హోటల్లో ఉద్యోగం. నెల తిరిగేసరికి జీతం వస్తోంది. అయితే సొంతంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నారు ఛాయ.
కూర్గ్ కొండలు కనిపించాయి
పరిశ్రమకు అవసరమైన శ్రమతత్వం తనలో ఉంది. మరి తాను నడిపించగలిగిన పరిశ్రమ ఏది? సొంతూరు కనిపించింది. కూర్గ్ కొండల్లో కాఫీ తోటలు, దట్టమైన చెట్లకు పెట్టిన తేనెపట్టులు కనిపించాయి. కాఫీ గింజలు తండ్రిని తీసుకెళ్లి చేదుని మిగిల్చాయి, అందుకేనేమో తన జీవితాన్ని తేనె తియ్యదనంతో నింపుకోవాలను కున్నారు. ప్రాక్టికల్‌గా కూడా తేనె పరిశ్రమ అయితేనే తనకు మంచిదనిపించిందామెకు. తేనె ప్రాసెసింగ్ స్కిల్స్ కోసం పుణె వెళ్లి సెంట్రల్ బీ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ కోర్సు చేశారు. అంతా ఓకే... కానీ పెట్టుబడి?
పది లక్షలు బ్యాంకు నుంచి లోన్ వస్తుంది, పది లక్షల మార్జిన్ మనీ తన వైపు నుంచి పెట్టాలి. తల్లి సేవింగ్స్, తన బంగారం అమ్మేసి పది లక్షలు జమ చేసింది. అలా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సహకారంతో బొమ్మనహళ్లిలో ‘నెక్టార్ ఫ్రెష్’ యూనిట్ మొదలైంది.
వయసును మించి పోటీ!
‘‘అప్పట్లో నాకు పోటీగా ఉన్న కంపెనీలన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్లే. వాటికంటే మెరుగ్గా ఇవ్వగలిగినప్పుడే నేను మార్కెట్లో నిలువగలుగుతాను. బీ రెన్బెర్గ్, దార్బో, బోన్నె మామన్ వంటి కంపెనీలు నేను పుట్టక ముందు నుంచి మార్కెట్‌ను ఏలుతున్నాయి. నేను కొత్త మార్కెట్ ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి అనుకున్నాను’’ అని చెప్తారు ఛాయానంజప్ప. అప్పుడు స్టార్ హోటల్లో ఉద్యోగానుభవం పని చేసింది. ఆతిథ్య పరిశ్రమల్లో ఆహార ఉత్పత్తుల వినియోగం రోజూ ఉంటుంది. తన ఉత్పత్తికి అదే అసలైన కేంద్రం అవుతుందనే అంచనాకు వచ్చారు ఛాయా నంజప్ప. ఆ ప్రయత్నం విజయవంతం అయింది. ఐటీసీ, లే మెరీడియన్ వంటి పెద్దపెద్ద హోటళ్లు ‘నెక్టార్ ఫ్రెష్’కు ఖాతాదారులయ్యారు.
తప్పని అడ్డంకులు!
వ్యాపారం సాగుతోంది, అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఫ్యాక్టరీని మూడేళ్లలోనే మూడు చోట్లకు మార్చాల్సి వచ్చింది. బొమ్మన హళ్లి నుంచి మైసూరు దగ్గరలోనే నంజన్గాడ్కు, అక్కడి నుంచి శ్రీరంగపట్నం తాలూకా బ్రహ్మపురాకి. మార్చిన ప్రతిసారీ లక్షల్లో నష్టం! యంత్ర పరికరాలు పాడయ్యేవి. వెళ్లిన చోట కొత్తగా ఉద్యోగులను చేర్చుకుని వాళ్లకు శిక్షణ ఇవ్వాలి. ‘ఇన్ని చోట్లకు మార్చడం వల్ల ఇప్పుడు వందకు పైగా కుటుంబాలు మా కంపెనీతో కలిసి పని చేస్తున్నాయి’ అని సానుకూల దృక్పథంతో అంటారు ఛాయా.
ఆహారమూ చేరింది!
నెక్టార్ ఫ్రెష్ వ్యాపారం ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్‌లోకి కూడా అడుగుపెట్టింది. మొదట్లో వద్దనుకున్న కాఫీని కూడా చేర్చుకుంది. ఇప్పుడు టమాటా కెచప్ తయారీకి సిద్ధమవుతోంది. దేశమంతటా విస్తరించడంతోనే ఛాయా సంతృప్తి చెందలేదు, ఏ వ్యాపారానికైనా తీరని దాహం ఉండాలి. ఆ దాహంతోనే ఇప్పుడు ఛాయా నంజప్ప కంపెనీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
అంచెల ఉపాధి!
తేనె సేకరణలో గ్రామీణ మహిళల సహకారం తీసుకున్నాను. ఆదివాసీ మహిళలకు అదొక మంచి అవకాశమైంది. తమంతట తాము తేనె సేకరించి సంతకు తీసుకెళ్లి అమ్మడంలో ఎదురయ్యే ఇబ్బందులు వారికి తొలగిపోయాయి. తమ గూడేలకే వచ్చి చేతిలో డబ్బు పెట్టి తేనె పట్టుకెళ్లే అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒక నెట్‌వర్క్‌గా కూడా ఏర్పాటయ్యారు! మొత్తం రెండువేల మంది మహిళల్ని కలిసి మాట్లాడాను. తేనె సేకరించడంలో పట్టు వచ్చింది. ప్రాసెస్ చేయడంలో మెళకువ తెలిసింది.
– ఛాయా నంజప్ప
రకరకాల తేనెలు!
ఛాయా సరఫరా చేస్తున్న తేనెకు డిమాండ్ పెరిగింది. అడవుల్లో సేకరించే తేనెతోపాటు హనీ కల్చర్ కూడా ప్రారంభించింది నెక్టా్టర్ ఫ్రెష్. రైతుల దగ్గర పంటకు అనువుగా లేని నేలను అద్దెకు తీసుకుని తేనెటీగల సేద్యాన్ని రకరకాలుగా అభివృద్ధి చేసింది. వీటితోపాటు మరో ఇరవై మొబైల్ అపియరీలు (తేనెటీగలను పెంచే స్థలం) కూడా ఉన్నాయి. అలా కూర్గ్ హనీతో మొదలైన ఛాయా వ్యాపారం హిమాచల్ హనీ వరకు విస్తరించింది. మొదట్లో నెలకు ఒక టన్ను తేనె ప్రాసెస్ చేసేవారు, ఇప్పుడది రెండు వందల టన్నులకు చేరింది.
ఛాయా నంజప్ప
‘నెక్టార్ ఫ్రెష్’ అధినేత, మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య సభ్యురాలు.
2014 నేషనల్ బెస్ట్ ఆంట్రప్రెన్యూర్ అవార్డు గ్రహీత.
కర్ణాటక, కూర్గ్ పర్వత ప్రాంతంలోని అల్పాదాయ వర్గాల మహిళలకు ఉపాధి కల్పించారు.
యాభై మిల్లీగ్రాముల మకరందాన్ని సేకరించడానికి ఒక తేనెటీగ ఇరవై లక్షల పూల మీద వాలుతుంది. వాటి శ్రమతో పోలిస్తే మనం పడే శ్రమ అసలు శ్రమే కాదు. సంతోషంగా ఉండండి, ఆ స్ఫూర్తితో పనిచేయండి
– ‘నెక్టార్ ఫ్రెష్’ స్లోగన్
యూనిట్ సభ్యులతో