చిల్లర.. ఓ బంగారు కోడిపెట్ట!
రాజమండ్రి: పేరుకది చిల్లర వ్యాపారమే కానీ డబ్బు నుంచి డబ్బును పొదిగి లాభాలు కురిపించే బంగారుకోడి పెట్ట! అందుకేనేమో చిల్లరను శ్రీమహాలక్ష్మి రూపమంటారు. గోదావరి పుష్కరాల పుణ్యమాని వ్యాపారులకు చిల్లర.. లాభాలను కొల్లగొట్టే మార్గంగా మారింది. నిత్యం లక్షల్లో వివిధ జిల్లాల నుంచి తరలివస్తోన్న భక్తులు నిర్వహించే పూజాదికాలకు చిల్లర అవసరం. దీన్ని ఆసరగా తీసుకుని లాభాలు సంపాదిస్తున్నారు కొందరు వ్యాపారులు. రూ.వందకు రూ.పది కమీషన్ తీసుకుని చిల్లర ఇస్తున్నారు. ఘాట్ల వద్ద, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలో నాణేలు కమీషన్ ప్రాతిపదికపై అందిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం భక్తులకు దగ్గరవడానికి నాణేలు అందిస్తున్నాయి.
రిజర్వ్‌బ్యాంక్ నుంచి ఆర్డర్లు రప్పించుకుని రోజుకు రూ.2లక్షల వరకు సరఫరా చేస్తున్నాయి. ఒక్క బ్యాంకులే పుష్కరాలు ముగిసేలోగా రూ.40లక్షల వరకు చిల్లర నాణేలు భక్తులు అందించనున్నాయి. అటు ప్రైవేటు వ్యాపారులు అనధికారికంగా స్టాళ్లు ఏరా్పాటు చేసుకుని చిల్లర వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా ప్రైవేటు చిల్లర వ్యాపారులు ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు వ్యాపారం చేశారని అంచనా. పుష్కరాలు ముగిసే సరికి చిల్లర నాణేలను సుమారుగా రూ.20 లక్షలకు పైగా సరఫరా చేయాలని అంచనా వేసుకున్నారు.