అభయారణ్యంలో అడ్డగోలు ఆక్రమణలు!
కైకలూరు, న్యూస్‌లైన్ : కొల్లేరు అభయారణ్యంలో అడ్డగోలు ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. అడ్డుకోవాల్సిన అటవీ అధికారులు మామూళ్ల మత్తులో నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కైకలూరు, మండవల్లి మండలాల పరిధిలో 17,449 ఎకరాలను 1999లో కొల్లేరు అభయారణ్యంగా గుర్తించి జీవో 120 జారీ చేశారు. 2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్ సమయంలో పై రెండు మండలాల్లో 15776 ఎకరాల్లో వెలసిన చేపల చెరువులను ధ్వంసం చేశారు. ఇందులో 55 సొసైటీల ఆధీనంలో ఉన్న 2476 ఎకరాల చెరువులున్నాయి.
సుప్రీంకోర్డు సాధికారిత కమిటీ అదేశాల ప్రకారం 1976లో జీవో నెంబరు 18 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కేటాయించిన సొసైటీలను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసింది. వీటిలో ఎటువంటి సాగు చేయకూడదని కఠిన నిబంధనలు విధించింది. అయితే అక్రమంగా సాగుచేయడమే కాకుండా చెరువుల విస్తీర్ణాన్ని సైతం పెంచేశారు. కైకలూరు మండలంలో శృంగవరప్పాడులో గంగరాజు ఫిషర్మెన్ సొసైటీ, ఆరుమీటర్ల సొసైటీ, పంజా గాంధీ సొసైటీ, పందిరిపల్లిగూడెంలో పాతపెడ, ముక్కుపెడ, గేజివల సొసైటీలతో పాటు లక్ష్మీపురం, గోకర్ణపురం సొసైటీలలో సాగు జరుగుతుంది. గోకర్ణపురం వెంకటరమణ సొసైటీ వాస్తవంగా 36 ఎకరాలు ఉండగా దానిని 58 ఎకరాల విస్తీర్ణానికి పెంచారు. అదే విధంగా మండవల్లి మండలం నందిగామలంక, పులపర్రు వంటి గ్రామాల సొసైటీ చెరువులలో సాగు జరుగుతుంది.
రేపు వేలం పాటకు ముహూర్తం.....
పందిరిపల్లిగూడె ంలో లాంచీల రేవు సమీపంలో శ్రీ వెంకట రమా ఫిషర్మెన్ కో - ఆపరేటీవ్ సొసైటీ పేరుతో ఉన్న 60 ఎకరాల చేపల చెరువు(ఒంటి తాడిచెట్టు చెరువు)ను కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేశారు. అనంతరం గట్లు నిర్మించుకుని అక్రమంగా సాగు చేస్తున్నారు. ఇటీవల కాలం వరకు ఏడాదికి రూ. 12 లక్షలు పాట జరగ్గా ఆదివారం నాటి పాటలో రూ. 15 లక్షలకు పైగా వస్తుందని భావిస్తున్నారు. మూడు రోజులుగా గ్రామంలో మైకు ద్వారా సెప్టెంబరు 1 సాయంత్రం 5 గంటలకు బడిసాల వద్ద పాటలు జరుగుతాయని సొసైటీ పెద్దలు బహిరంగంగా ప్రకటిస్తున్నా....అటవీఅధికారులు మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
ఈ సొసైటీలో మొత్తం 80 మంది సభ్యులున్నారు. అసలు చేసేదే అక్రమమైనప్పటికీ పంపకాల్లో సభ్యుల్లోనూ విభేదాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇతర గ్రామాల్లో నివసిస్తున్న వారికి సొసైటీ పంపకాల్లో అవకాశం ఉండదు. ఈ విషయంలో సొసైటీ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి. నిరుద్యోగులుగా ఉన్న 8 మంది యువకులకు సొసైటీలో అవకాశం కల్పించాలని కోరితే నిరాకరించడంతో వివాదం మొదలయ్యింది. న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడానికి వారు సిద్ధపడుతున్నారు.
గ్రామంలో టముకు వేయిస్తాం.....
వేలం పాటలు నిర్వహించకూడదంటూ కొల్లేటి గ్రామాల్లో టముకు వేయాలని ఇప్పటికే సిబ్బందిని ఆదేశించమని అటవీశాఖ రేంజర్ రత్నకుమార్ చెప్పారు. కొల్లేరు అభయారణ్యంలో అక్రమ సాగు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పందిరిపల్లిగూడెంలో శనివారం సిబ్బంది ద్వారా టముకు వేయిస్తామని తెలిపారు.