పరికరాల సరఫరాలో తీవ్రజాప్యం
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : పనికి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 5.10 లక్షల మంది జాబ్ కార్డులు కలిగిన కూలీలు ఉన్నారు. వారిలో రోజుకు 40 వేల నుంచి 60 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వీరు పనులు చేసేందుకు గడ్డపారలు, చెలగపారలు అవసరమవుతాయి. వీటితో పాటు పని ప్రదేశంలో షామియానాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి.
వీటిని పూర్తిస్థాయిలో అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(సీఆర్డీ) అధికారులు హైదరాబాద్‌లో టెండర్లు నిర్వహించారు. అయితే కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి పది నెలలు కావస్తున్నా వాటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయడంలో విఫలమయ్యారు. జిల్లాలో జరుగుతున్న పనులకు సుమారు 50 వేల గడ్డపారలు అవసరమవుతాయి. అందులో భాగంగా దగదర్తి, కావలి, కలిగిరి మండలాల్లో కేవలం 4,800 గడ్డపారలు సరఫరా చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు గడ్డపారలు సరఫరా చేయాలని సీఆర్డీ అధికారులు ఉత్తర్వులు జారీ చేసి నెలలు కావస్తున్నా ఫలితం కరువైంది. ఒక జిల్లాకు పరికరాలు సరఫరా చేయగా వచ్చిన నగదుతో మరో జిల్లాకు సరఫరా చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పరికరాల సరఫరాలో తీవ్రజాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కూలీలే గడ్డపారలు, చెలగపారలను బాడుగకు తెచ్చుకుని పనులు చేస్తున్నారు. మరోవైపు పనిచేసే ప్రదేశంలో కూలీలు సేద తీరేందుకు షామియానాలు అవసరం. రెండేళ్ల కిందట సరఫరా చేసిన షామియానాలు పూర్తిగా దెబ్బతినడంతో కూలీలు ఎండలో ఇబ్బంది పడుతున్నారు.
చర్యలు తీసుకుంటాం :
గడ్డపారలను త్వరగా సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పనిచేసే ప్రాంతంలో అన్ని పరికరాలను అందుబాటులో ఉండేలా చూస్తాం. గత నెలలో కొన్ని మండలాల్లో షామియానాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ సరఫరా చేశాం. కూలీలు పరికరాలను బాడుగకు తెచ్చుకున్నా నగదు చెల్లిస్తున్నాం. కూలీలు ఇబ్బంది పడకుండా చూస్తున్నాం.
- ఎం. గౌతమి, డ్వామా పీడీ