వట్టి గ్యాసేనా..
మంజూరైన ఉచిత కనెక్షన్లు 1.20లక్షలు
పంపిణీ చేసింది కేవలం 1,866
{పారంభమే కాని దీపం కనెక్షెన్ల పంపిణీ
రెగ్యులేటర్లు లేవంటూ చేతులెత్తేసిన ఆయిల్ కంపెనీలు
గాల్లో మేడలు కట్టడం..అరచేతిలో వైకుంఠం చూపడం మన నేతలకు వెన్నతో పెట్టిన విద్య. వాస్తవికతను పట్టించుకోకుండా వారు చెప్చే ప్రతీ దానికి తానా తందానా అంటూ తలలూపడం మన అధికారులకు అలవాటు. నేతల హామీలు..అధికారుల ప్రకటనలను నమ్మి మోసపోవడం సామాన్యుల వంతవుతోంది. తాజాగా ఆ కోవకే చేరింది ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకం. నిజంగా ఇదంతా వట్టిగ్యాసే అన్న విషయం మరోసారి సుస్పష్టమవు తోంది.
విశాఖపట్నం: సామూహిక సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద డిపాజిట్ లేకుండా గ్యాస్కనెక్షన్లు ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. గతేడాది డిసెంబర్లో జిల్లాకు లక్షా 20వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇంకేముంది ఆ క్రెడిట్ మాదంటే మాదంటూ గొప్పలు చెప్పు కునేందుకు కేంద్ర,రాష్ర్టప్రభుత్వాల పెద్దలు పోటీపడ్డారు. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేదలకు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకోసం పారదర్శకత పేరుతో సామాన్యులకు కనీస అవగాహన లేని ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. మరొక పక్క మా కార్యకర్తల పరిస్థితి ఏమిటంటూ అధికార టీడీపీ, బీజేపీ నేతలు పోటీపడి మరీ తమ అనుచరులచే దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టించారు.
మార్చి31లోగా వీటి పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. వీటిలో సుమారు లక్షా 20వేల మందికి అర్హత ఉన్నట్టుగా నిర్ధారించారు. వీరిలో ఏఎస్వోలు, సీఎస్డీటీలు అప్రూవ్ చేసిన 75,111(ఏజెన్సీలో 15,735, జీవీఎంసీ, ఇతర మున్సి పాల్టీలతో సహా మిగిలిన గ్రామీణ జిల్లాలో 59,376)లో తొలి విడతగా కనీసం 36,503 మందికి మార్చి31 కల్లా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని అధికారులు తలపోశారు. ఆ మేరకు ఆయా గ్యాస్ కంపెనీల వారీగా మంజూరైన జాబితాలను సైతం పంపించారు. కానీ కంపెనీలు మాత్రం కేవలం 1866 కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఒకేసారి లక్షన్నరకు పైగా గ్యాస్కనెక్షన్లు మంజూరు చేసినా ఆ స్థాయిలో ఒకేసారి రెగ్యులేటర్లు, సిలెండర్లు సరఫరా చేయడం సాధ్యం కాదని ఆయిల్ కంపెనీలు చేతులెత్తేశాయి. ఈవిషయంలో ఇటీవలే విశాఖ, అనకాపల్లి ఎంపీలు జి.హరిబాబు, ఎం.శ్రీనివాసరావులు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు,గ్యాస్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంపిణీ చేయలేనప్పుడు అన్ని కనెక్షన్లు ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని ఢిల్లీలోనే తెల్చుకుంటామని తీవ్ర స్థాయిలోనే హెచ్చరించారు. ఏది ఏమైనా దశల వారీగా మంజూరు చేస్తామే తప్ప ఒకేసారి సరఫరా చేయడం మా వల్ల కాదని కంపెనీలు తేల్చి చెప్పడంతో లబ్ధిదారులు నిజంగా ఇదంతా వట్టి ‘గ్యాసే’ అంటూ నిట్టూరుస్తున్నారు. ఉచిత కనెక్షన్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక దీపం కనెక్షన్లు పంపిణీ కూడా వీటికి ఏ మాత్రం తీసిపోని రీతిలోనే ప్రహసనంగా సాగుతోంది. జిల్లాకు తొలుత 25వేల దీపం కనెక్షన్లను మంజూరయ్యాయి. ఆ తర్వాత మరో 9,500 కనెక్షన్లు ఇచ్చారు. ఎంపిక బాధ్యత పేరుకు ఎంపీడీవోలకు అప్పగించినప్పటికీ పెత్తనమంతా జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. మార్చి రెండోవారానికే అధికారులు అర్హులై జాబితాలను సిద్ధం చేసినా అవి మళ్లీ జన్మభూమి కమిటీల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. తమ అనుచరులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యేల సమక్షంలో తుదిజాబితాలు తయారు చేస్తున్నారని చెబుతున్నారు. రెగ్యులేటర్లు, సిలెండర్ల కొరత ‘దీపం’కు కూడా శాపంగా తయారైంది. ఈ కారణంగానే వీటి ఎంపికలో జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారు.