మరపు మంచిదే..
ఆవిష్కరణ
ప్రముఖ డిటర్జెంట్ యాడ్ నినాదం ‘మరక మంచిదే’ అన్నట్లుగానే ఒక్కోసారి మతిమరపు కూడా మంచిదే! రష్యన్ రసాయనిక శాస్త్రవేత్త కాన్స్టంటిన్ ఫాల్బెర్గ్ మతిమరపు ప్రపంచానికి తీపి ఫలితాన్ని ఇచ్చింది. ఈ మతిమరపు శాస్త్రవేత్త ఓసారి ల్యాబొరేటరీలో సాటి శాస్త్రవేత్త ఇరా రెమ్సెన్తో కలసి పనిలో నిమగ్నమైనప్పుడు బాగా ఆకలివేసింది.
పనికి బ్రేకిచ్చి, భోజనానికి కూర్చున్నాడు. అయితే, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం మరచిపోయాడు. దాదాపు సగం భోజనం పూర్తయ్యాక, తాను తింటున్న పదార్థాలు తీపిగా మారడాన్ని గుర్తించాడు. వెంటనే ల్యాబొరేటరీకి వెళ్లి చూశాడు. తాను తయారు చేసిన ఆక్సిడైజ్డ్ రసాయనం ఫలితంగానే తన భోజనం తీపిగా మారినట్లు గుర్తించాడు. ఆ పదార్థానికి ‘శాకరిన్’గా నామకరణం చేశాడు.
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో చక్కెరకు కటకట ఏర్పడినప్పుడు ‘శాకరిన్’కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మధుమేహ రోగుల కారణంగా ఇప్పటికీ దీనికి గిరాకీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘శాకరిన్’కు 200 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది.