కొలువుల బేరం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ :
కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పోస్టుల నియామకాలలో పైరవీలు జోరందుకున్నాయి. వైద్యశాఖ అధికారులపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడి విపరీతంగా పెరిగి నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వైద్య శాఖ కార్యాలయంలో ఓ అధికారి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అభ్యర్థినులను బోల్తాకొట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం తప్పనిసరి అని చెబుతూ ఆసక్తి ఉన్న అభ్యర్థినులతో మా ట్లాడుతున్నట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.40 వేల నుంచి రూ. 50 వేలు వసూ లు చేస్తున్నట్లు సొంత శాఖ ఉద్యోగులే పేర్కొం టున్నారు. కార్యాలయంలోనే అభ్యర్థినుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఉన్నవారిని ఎం పిక చేసుకుని ఫోన్లో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. వారికి ఉద్యోగాల ఆశ చూపుతూ డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజాంసాగర్ మండలానికి చెందిన ఓ అభ్యర్థిని శనివారం ఇంటికి పిలుపించుకొని డబ్బుల బేరం ఆడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా సంప్రదిస్తూ వారికి తెలిసిన వారుంటే ఉద్యోగం ఇప్పిద్దామంటూ మభ్యపెడుతున్నట్లు తెలిసింది. కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టుల కోసం ప్రజాప్రతినిధులే ఎక్కువగా అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పీఏ వారం రోజుల నుంచి మూడుసార్లు అధికారులకు ఫోన్లు చేసినట్లు సమాచారం. బాల్కొండ మండలానికి చెందిన ఓ సర్పంచ్, ఎమ్మెల్యే పేరు చెబుతూ తమ అభ్యర్థినులకు రెండు పోస్టులు కేటాయించాలని అధికారులపై ఒత్తిడి చేస్తునట్లు ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. మరో ఎమ్మెల్యే పీఏ సైతం సెక్షన్ అధికారికి రాతపూర్వకంగా రికమెండేషన్లు చేశారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
28 పోస్టులు, 470 దరఖాస్తులు
కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టులు 28 ఉండగా జిల్లావ్యాప్తంగా 470 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎంపిక జాబితాను ప్రకటించనున్నారు. దరఖాస్తులు ఎక్కువగా రావడం వల్లే ఎంపిక ఆలస్యం అవుతోందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
పారదర్శకంగానే ఎంపిక
-గోవింద్ వాగ్మారే, జిల్లా వైద్యాధికారి
కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఎంపిక పారదర్శకంగానే జరుగుతుంది. నిబంధనల ప్రకారం చేపడుతాం. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గం. అభ్యర్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.