ఎవరి లెక్కలు వారివే !
పోలింగ్‌పై నేతల విశ్లేషణలు
కౌన్సిలర్ అభ్యర్థుల్లోనూ ఎడతెగని చర్చలు
మున్సిపల్ కౌంటింగ్‌పై నేడు హైకోర్టు తీర్పు
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు జయాపజయాల లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో 70 శాతం పోలింగ్ దాటడంతో ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, చిత్తూరు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యే పోటీ నెలకొని ఉంది. అయితే కొన్నిచోట్ల స్వతంత్రులు కూడా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. చిత్తూరు కార్పొరేషన్లో రెండు ప్రధాన రాజకీయపార్టీలతో పాటు, సీకే.బాబు స్వతంత్ర ప్యానల్ కూడా గట్టిపోటీ ఇవ్వడంతో ఇక్కడ గెలుపు లెక్కల్లో చాలావరకు స్పష్టత లేదు.
జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలు, ప్రజల్లో వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, మహిళలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనటం తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు లాభించే అంశాలుగా ైవె ఎస్సార్ సీపీ నేతలు భావిస్తున్నారు. నగరి మున్సిపాలిటీలో జిల్లాలోనే అత్యధికంగా 88 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఇక్కడ ఫ్యాను గాలి ఓట ర్లలో బలంగా వీచిందని పోలింగ్ సరళి తేటతెల్లం చేసింది. ఒక దశలో దీనిని సహించలేక 3వ వార్డులో మాజీ మంత్రి చెంగారెడ్డి అనుచరులు గొడవకు దిగారు.
పుత్తూరు మున్సిపాలిటీలోనూ పోలింగ్ సరళి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉంది. పుంగనూరులోనూ అత్యధిక స్థానాలు గెలుచుకుని చైర్మన్ కుర్చీ కైవసం చేసుకునే దిశగా వైఎస్సార్ సీపీ ఉంది. పలమనేరులోనూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థు లు గెలుస్తారని, పోలింగ్‌సరళి తమకు అనుకూలంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలోనూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని నేతల విశ్లేషణ.
మున్సిపాలిటీల్లో ఇలా వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటుండగా, ఎన్నికల సారథ్యం వహించిన రెండు పార్టీల నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇన్‌చార్జ్‌లు ఫలితాలు వెల్లడైతే ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలో ఉన్నారు. వార్డుల్లో అభ్యర్థులుగా పోటీ చేసినవారు తాము పెట్టిన ఖర్చులకు గెలుపు వరిస్తుందా? వార్డుల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? తమకు అనుకూలంగా ఎన్ని ఓట్లు పోలయి ఉంటాయనే విశ్లేషణలో పడ్డారు.
నేడు మున్సిపల్ కౌంటింగ్‌పై తీర్పు
జిల్లాలో నిర్వహించిన చిత్తూరు కార్పొరేషన్, మరో ఆరు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి మంగళవారం కోర్టు తీర్పు వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించాలని కోరుతూ కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం కోర్టు తీర్పుకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మే 7 తరువాత వెల్లడి కానున్నాయి. అలాగే జరిగితే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు.
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల విశ్లేషణలు
మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం మున్సిపల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇన్‌చార్జ్‌లుగా ఉన్నవారు తమ తమ వర్గాల నుంచి వివరాలు, ఓటింగ్ సరళి తెప్పించుకుని సొంతంగా విశ్లేషిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో నిలబడేందుకు ఈ ఎన్నికల ఫలితాలు తమకు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి? ఎంతవరకు ప్రతికూలంగా ఉండొచ్చునని లెక్కలు వేస్తున్నారు. ఒక రకంగా తమకు మున్సిపల్ ఎన్నికల వల్ల మంచే జరుగుతుందని, ఒకవేళ ప్రతికూల పవనాలు వీస్తున్న వార్డులు ఏవనేది గుర్తించి అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు జాగ్రత్త వహించేందుకు అవకాశం ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు చెబుతున్నారు.