తప్పుల తడక
= ఓటర్ల జాబితాపై సీఓపీఎస్
= 14 అంశాలపై సర్వే
= ఒక్కో ఓటరుకు నాలుగైదు ఐడీ కార్డులు
= ఫొటోలూ గల్లంతు
= జాబితాలో 11 శాతం తప్పులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని పలు నియోజక వర్గాల్లో ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా తయారయ్యాయని నగరంలోని క్రియేటివ్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ పొలిటికల్ స్టడీస్ (సీఓపీఎస్) తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ఓటర్ల జాబితాలను గత నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ నెల పది వరకు పరిశీలించింది. 70 మంది ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు ఈ కసరత్తులో పాల్గొన్నారు. ఒకే ఓటరు పేరు రెండు సార్లు చోటు చేసుకోవడం, చనిపోయిన ఓటర్లు, పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన, వలస పోయిన ఓటర్లు, వయసులో తేడాలు, లింగ నిర్ధారణలో తప్పులు, ఫొటో లేకపోవడం, పేరు మార్పు, ఎపిక్ నంబరు మార్పు...ఇలా 14 అంశాలపై సర్వే చేశారు.
తేలిందేమంటే...
జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని, ఇంటి చిరునామా మారిపోయిందని, వార్డు నెంబరును మార్చేశారని సర్వే సందర్భంగా ఓటర్లు ఫిర్యాదు చేశారు. ఉదాహరణకు నగరంలోని బసవనగుడి నియోజక వర్గంలో ఖాళీ నివేశనం చిరునామా పేరిట నాలుగైదు ఐడీ కార్డులున్నాయి. ఒక బ్యాంకు పేరిట రెండు, మూడు ఐడీ కార్డులున్నాయి. ఓ టీ దుకాణం చిరునామాలో పది మందికి పైగా ఓటర్లున్నారు. అయితే అక్కడ అలాంటి వారెవరూ లేరు. కొందరి ఓటర్లు వయసు తప్పుగా నమోదు చేశారు. ఉదాహరణకు ఓ ఓటరు వయసును ఏడాదిగా పేర్కొన్నారు. మరో ఓటరు వయసు 196గా ఉంది. ఓటర్ల జాబితాలో అనేక మంది ఫొటోలు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్ల పేర్లు మారిపోయాయి.
ఓటర్ల ఆగ్రహం
అధికారుల నిర్లిప్త వైఖరిపై ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆరు సార్లకు పైగా దరఖాస్తు చేసుకున్నా ఐడీ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో చాలా మంది విసిగిపోయారు. రాజకీయ పార్టీలు ఖాతా లేదా రేషన్ కార్డులను ఇప్పించడంలో చూపిస్తున్న ఉత్సాహం ఓటరు ఐడీ కార్డుల విషయంలో చూపడం లేదు.
సర్వే చేసిన నియోజక వర్గాలు
తుమకూరు, చిత్రదుర్గ, దావణగెరె దక్షిణ, హావేరి, గదగ, హుబ్లీ-ధార్వాడ తూర్పు, హుబ్లీ-ధార్వాడ సెంట్రల్, బెల్గాం రూరల్, చిక్కోడి, గుల్బర్గా ఉత్తర, బీదర్, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి రూరల్, కోలారు, చిక్కబళ్లాపురం, రామనగర, మండ్య, మైసూరు, హాసన, చామరాజ నగర, బిజాపుర, బాగలకోటె, హొసకోటె, కార్వార, చిక్కమగళూరు, ఉడిపి, మంగళూరు దక్షిణ, శివమొగ్గ నగరం, మడికేరి, బసవనగుడి, రాజాజీ నగర.
ముక్తాయింపు
క్షేత్ర స్థాయిలో 34 రోజుల పాటు కసరత్తు చేసిన అనంతరం బసవనగుడి నియోజక వర్గంలో 25,347 తప్పులు తేలాయి. మొత్తం ఓటర్లతో లెక్కిస్తే ఇది 12.72 శాతం. బెల్గాం రూరల్లో అత్యధికంగా 30.925 తప్పులు కనిపించగా, బెంగళూరులోని రాజాజీ నగరలో తక్కువగా 20.816 తప్పులు దొర్లాయి. మొత్తం ఓటర్లు 64,52,007 కాగా 8,27,313 (11 శాతం) తప్పులు తేలాయి.