అంతకన్నా వేరే కిక్కేముంటుంది!
లగడపాటి శ్రీధర్
సంచలన విజయం సాధించిన కామెడీ చిత్రం ‘ఎవడి గోల వాడిదే’కి సీక్వెల్ తీయాలని ఉందంటున్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అలాగే ‘స్టైల్’ చిత్రాన్ని నాయికా ప్రాధాన్యంగా తీయాలన్నది తన కల అని ఆయన చెప్పారు. నేడు శ్రీధర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన ఈ విధంగా చెప్పారు.నిర్మాతగా రంగప్రవేశం చేసి, ఈ ఏడాదితో పదేళ్లయ్యింది. ‘క్రియేటివ్ వరల్డ్’లో ఉండటంవల్లనో ఏమో సమయం గడిచిపోతున్నట్టే అనిపించడంలేదు.
- నాకైతే పదేళ్ల వయసు తగ్గిందేమో అనిపిస్తోంది. ఇలా వయసు తగ్గినట్లుగా అనిపించడానికి కారణం ఉంది. మేం తీసే సినిమాలు 16ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న వారి చుట్టూ తిరిగేవే. దాంతో ట్రెండ్‌కి తగ్గ ఆలోచనలు, చర్చలు జరుగుతుంటాయి. ఇక, అంతకన్నా కిక్కేముంటుంది. అందుకే అంటున్నా... ఎవరికైనా సరే వయసు తరగాలంటే సినిమా రంగంలోకి రండి అని.
- ప్రస్తుతం సుధీర్‌బాబు, నందితతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ తీస్తున్నాను. కన్నడ ‘చార్మినార్’కి ఇది రీమేక్. ప్రేమకథా చిత్రాల్లో టైటానిక్ అంత గొప్పగా ఉండే సినిమా అవుతుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నా.
- ఇక నుంచి తమిళంలో లింగుస్వామి రూపొందించే చిత్రాలను తెలుగులో కూడా చేస్తా. ప్రస్తుతం సూర్య, సమంత జంటగా ఆయన రూపొందిస్తున్న ‘అంజాన్’ని ఏకకాలంలో తెలుగులో చేస్తున్నాం. దీన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నా. అలాగే లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నా. ఇందుకు బన్నీ, లింగుస్వామి ఇద్దరూ సుముఖంగా ఉన్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లతో విడి విడిగా సినిమాలు తీయాలని ఉంది.