కార్మికుల సొమ్ముతో వారికే జీతాలు
సాక్షి, హైదరాబాద్: కార్మికులు పొదుపు చేసుకున్న సొమ్మును వారికే జీతాల కింద ఇవ్వడం.. పైగా వారికే అప్పులు పుట్టకుండా చేయడం.. ఇదీ.. నేడు ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల పొదుపు సొమ్ముపై అవలంబిస్తోన్న తీరు. సీసీఎస్ వద్ద వడ్డీ లేని రుణాలకు అలవాటు పడిన ఆర్టీసీ యాజమాన్యం దాన్ని ఒక బంగారుబాతులా వాడుకుంటోంది. పరిధి మేరకు దాని ఫలితాలు పొందితే ఫరవాలేదు. మరింత అత్యాశకుపోతే.. సీసీఎస్ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇప్పటికే సీసీఎస్ వద్ద తీసుకున్న రుణం దాదాపు రూ.500 కోట్లకు చేరువలో ఉంది.
నేపథ్యం ఏంటి?
ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా పొదుపు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ‘క్రెడిట్ అండ్ కో–ఆపరేటివ్ సొసైటీ’(సీసీఎస్). ప్రతినెలా కార్మికుల వేతనం నుంచి కొంతమొత్తం మినహాయించుకుని ఈ సొమ్ముకు 10 శాతం వడ్డీతో రిటైర్మెంట్ తరువాత పొదుపు మొత్తాన్ని అందజేస్తారు. (ఇతర సొసైటీలు 6 నుంచి 7 శాతానికి మించి ఇవ్వడం లేదు). సీసీఎస్ వద్ద ఉన్న నిధులు దాదాపుగా రూ.1,500 కోట్లు. ఈ మొత్తం మధ్యతరహా బ్యాంకుల కన్నా అధికం కావడం గమనార్హం. ఇందులో కార్మికులు వేతనాల రూపంలో దాచుకున్న సొమ్మే రూ.900 కోట్లు కావడం గమనార్హం. నెలనెలా ఆర్టీసీ యాజమాన్యం రూ.40 కోట్లను కార్మికుల వేతనాల నుంచి కట్ చేసి సీసీఎస్కు జమచేయాలి. కానీ ఇలా ప్రతినెలా నిధుల మళ్లింపుతో బకాయిల మొత్తం రూ.380 కోట్లకు చేరింది. డిసెంబర్లో రూ.80 కోట్లు చెల్లించినా.. డిసెంబర్, జనవరి నెలలకు మరోసారి నిధులు మళ్లించడంతో అది మళ్లీ రూ.380 కోట్లకు చేరింది. ఆర్టీసీ విభజన తరువాత సీసీఎస్ నుంచి తెలంగాణ ఆర్టీసీ రూ.106 కోట్ల నిధులు అప్పుగా తీసుకుంది. దీంతో మొత్తం అప్పుల విలువ రూ.480 కోట్లు దాటడం గమనార్హం.
కార్మికుల రికవరీ సొమ్ముతో వారికే జీతాలు..
కార్పొరేషన్ వద్ద సరైన నిధులు లేకపోవడంతో వారి జీతాలనుంచి కొన్నేళ్లుగా సీసీఎస్కు జమ చేయాల్సిన కార్మికుల ప్రీమియం డబ్బును ఆర్టీసీ యాజమాన్యం తిరిగి వారి వేతన చెల్లింపులకే మళ్లిస్తోంది. వాస్తవానికి సీసీఎస్ స్వతంత్రంగా వ్యవహరించే సహకార సంస్థ. కానీ, నిధులను ఇష్టానుసారంగా మళ్లిస్తూ సీసీఎస్ సంస్థను ఆర్టీసీ యాజమాన్యం తన జేబుసంస్థగా మార్చుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు 12 శాతం చొప్పున రూ.250 కోట్లు వడ్డీ కడుతున్న ఆర్టీసీ.. సీసీఎస్కు మాత్రం ఎలాంటి వడ్డీ చెల్లించడం లేదు. ఒకవేళ వడ్డీ చెల్లించాల్సి వస్తే.. 2015 నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకున్నా దాదాపు రూ.30 కోట్లకుపైగా సీసీఎస్కు ఆర్టీసీ కట్టాల్సి ఉండేదని సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదంలో సీసీఎస్ మనుగడ...
కార్మికులను ఆపత్కాలంలో ఆదుకునే సీసీఎస్ నిధులను మళ్లించడం అన్యాయమని, ఇలాంటి చర్యలు కార్మికుల జేబులకు చిల్లులు పెట్టడమేనని కార్మిక సంఘాల నేతలు థామస్రెడ్డి (టీఎంయూ), నాగేశ్వరరావు (ఎన్ఎంయూ) హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ), రాజిరెడ్డి (ఈయూ) తదితరులు విమర్శిస్తున్నారు. ఆర్థికలోటు ఇలాగే కొనసాగితే సీసీఎస్ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఆర్టీసీని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు అక్షింతలు వేసినా..
వాస్తవానికి ఇదేం కొత్త వివాదం కాదు. 2015లోనూ సీసీఎస్ తన బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్పందించిన హైకోర్టు సీసీఎస్ నిధులను 60 రోజుల కంటే ఎక్కువగా వాడుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఆ సమయం దాటితే మాత్రం ఉద్యోగుల నుంచి సీసీఎస్ రికవరీ డబ్బులు మళ్లించడం నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్టీసీ విభజన తరువాత ఏపీఎస్ ఆర్టీసీ ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా 10 రోజుల్లో రికవరీ మొత్తాన్ని సీసీఎస్కు జమచేస్తుండటం గమనార్హం.
అధిక వడ్డీలతో నలిగిపోతున్న కార్మికులు
సీసీఎస్ కార్మికులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. విద్య, వ్యక్తిగత అవసరాలు, పిల్లల వివాహం తదితర అవసరాలకు 11 శాతం చొప్పున వడ్డీతో అప్పులు ఇస్తుంది. గృహరుణాలు 8.5 శాతం తక్కువ వడ్డీకే మంజూరు చేçస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం తీరు కారణంగా సీసీఎస్ నుంచి కార్మికులకు రావాల్సిన లోన్లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో చేసేదిలేక కార్మికులు బయట అధిక వడ్డీకి రుణాలు తీసుకుని ఆర్థికంగా మరింతగా చితికిపోతున్నారు.