మంచాలమ్మకు శ్రీమఠం పీఠాధిపతి పూజలు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దశమి సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు గ్రామ దేవత మంచాలమ్మకు విశేష పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రం, బంగారు కిరీటం సమర్పించి అర్చన, అభిషేకాలు చేపట్టారు. అమ్మ సన్నిధిలో అరగంటపాటు గడిపారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి హారతులు పట్టి మూలరాముల పూజలకు ఉపక్రమించారు. రాత్రి శ్రీమఠం ప్రాంగణంలోని బన్ని(శమీ) వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మఠం నుంచి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ఊరేగింపుగా అక్కడికి తీసుకెళ్లి వృక్షం ఎదుట ఆశీనులు చేశారు. పండితుల వేదపఠనం చేస్తుండగా శాస్త్రోక్తంగా పుష్ప, ముత్యాలభిషేకం జరిపారు. దసరా సెలవులు రావడంతో భక్తులు వేలాదిగా శ్రీక్షేత్రాన్ని సందర్శించారు. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు.