డాటర్ బై కోర్ట్ ఆర్డర్
అమ్మాయిలను మగపిల్లలతో సమానంగా పెంచాలి. ఆడ, మగ అని తేడా లేకుండా నిష్పక్షపాతంగా ప్రేమను పంచాలి. ఇవన్నీ ప్రతిరోజూ, అందరి నోటా వినిపించే మాటలే. కానీ ఆచ రణ ఏమేరకు? అన్నది ప్రశ్నార్థకమే! దీనిపై చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రముఖ రచయిత్రి రత్న వీర. ఇటీవల ఆమె రాసిన ‘డాటర్ బై కోర్ట్ ఆర్డర్’ సంచలనం సృష్టిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఆమె రచనలకు అభినందలు తెలిపారు.
గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) మహిళా సాధికారతపై నిర్వహించిన చర్చాగోష్టిలో రత్నవీర పాల్గొని ప్రసంగించారు.పలు ప్రశ్నలకూ సమాధానమిచ్చారామె. ప్రముఖ జర్నలిస్టు నళినీసింగ్ కూతురిగా చిన్నప్పటి నుంచే సమాజానికి ఏదో చేయాలనే లక్ష్యంతో పెరిగారు రత్నవీర. ఇటు పారిశ్రామిక రంగంలో దూసుకుపోతూ మరోవైపు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు.
వివక్ష వద్దు...
‘కొడుకు, కూతుళ్ల మధ్య పక్షపాతం చూపించే వారిలో మార్పు తేవాలన్నదే నా ఆశయం. నా కూతురు పదహారేళ్ల సుహాసిని నా పుస్తకం చదివి నన్నెంతో అభినందించింది. అప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఏ దేశంలో లేని వివక్ష కేవలం మన దేశంలోనే చూశాను. అదే నా ఈ పుస్తకానికి మూలం. ప్రస్తుతం హిందీలోకి అనువాదం జరుగుతోంది. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు 18 నెలలు ఇక్కడే ఉన్నాను. మళ్లీ ఇప్పుడు, ఇంత మంచి కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది’ అని తన మనసులోని మాటలు పంచుకున్నారు రత్నవీర.