Davaleswaram
-
ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక
సాక్షి, పశ్చిమగోదావరి : గోదావరిలో వరద ఉగ్రరూపు దాల్చింది. ఐదు రోజుల నుంచి ఏజెన్సీలో 19 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొవ్వూరులో గోష్పాద క్షేత్రాన్ని గోదావరి వరద ముంచెత్తింది. క్షేత్రంలో రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లో లంకభూముల్లో పంటలు నీటమునిగాయి. యలమంచిలి మండలం కనగాయలంక కాజ్‌వేపై నుంచి నాలుగు అడుగుల మేరకు వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అక్కడ పడవలు ఏర్పాటు చేసి జనాన్ని ఒడ్డుకు చేర్చుతున్నారు. పెరవలి మండలంలో కానూరు, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు, మల్లేశ్వరం, ఖండవల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు వరదనీట మునిగాయి. కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం, నిడదవోలు, పెనుగొండ మండలాల్లోను లంకభూములు ముంపుబారిన పడ్డాయి. ఏజన్సీలో పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలో 39 గ్రామాలకు ఐదు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతంలో వరద నెమ్మదిస్తుండడంతో ఉదయం పది గంటల నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి 14.10 నుంచి నిలకడగా కొనసాగింది. ఒంటిగంటకి 14.20 అడుగులకు పెరిగింది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లను పూర్తిగా ఆల్ క్లియర్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆనకట్ట నుంచి 13,50,363 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో వరద ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు స్ధిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. గోదావరికి ఎగువ ప్రాంతంలో భద్రాచలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ కాళేశ్వరం, దుమ్ముగూడెం, పేరూరు తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో వరద ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,800 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. తూర్పు డెల్టాకు 4వేలు, సెంట్రల్‌కి 1,800లు, పశ్చిమ డెల్టాకు 2వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడిచి పెడుతున్నారు. ముంపులోనే పంటపొలాలు డెల్టాలో గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో ఇంకా 4,746 హెక్టార్ల పంట ముంపులోనే ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. 591 హెక్టార్లలో వరి నారుమళ్లు ముంపు బారిన పడితే దీనిలో 412 హెక్టార్ల నారుమళ్లు కుళ్లిపోయాయన్నారు. 7,550 మంది రైతులకు చెందిన 1,026 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంపులో ఉన్న పంటలు తేరుకుంటే నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అ«ధికారులు చెబుతున్నారు. పెరవలి మండలంలో సుమారు 2,200 ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. మిగిలిన తీర ప్రాంత మండలాల్లో సుమారు రెండు వందల ఎకరాల పంట నీటమునింది. ముంపు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ పర్యటన ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్ కలెక్టర్ సలీమ్‌ఖాన్‌లు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. లంక గ్రామాల్లో పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్దమల్లం లంక, అయోధ్యలంక, రవిలంక, మర్రిమూల, పుచ్చలలంక గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 39 గ్రామాలకు రాకపోకలు బంద్ గోదావరి వరద ముంచెత్తడంతో పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద బాధితుల కోసం పోలవరం, వేలేరుపాడు గ్రామాల్లో రెండు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 51 కుటుంబాలకు చెందిన 133 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ వరద పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఇన్చార్జ్ మంత్రి సుభాష్ చంద్రబోస్‌లు ముంపు ప్రాంతంలో పర్యటించారు. ముంపు ప్రభావిత గ్రామాలకు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించి ముందుస్తు ఏర్పాట్లు చేశారు. ముంపు ప్రాంతంలో 4,088 కుటుంబాలకు అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 1,022 క్వింటాళ్ల బియ్యం, బంగాళ దుంపలు, ఉల్లిపాయాలు, 4,088 లీటర్ల పామాయిల్, 8,716 లీటర్ల కిరోసిన్, 4,188 కేజీల కందిపప్పు అందజేశారు. 56 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతంలో 53 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 1,156 మందికి వైద్య సేవలు అందజేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 13 డెంగీ, డయేరియా కేసులకు వైద్యం చేశామన్నారు. ముంపు గ్రామాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలతో పాటు అన్ని రకాలైన మందులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
నిలకడగా గోదారి వరద
కొవ్వూరు : గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో బుధవారం 2,97,160 క్యూసెక్కులుగా నమోదైంది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 8,600 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. మిగిలిన 2,88,560 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం ఆరుగంటలకు నీటిమట్టం 9.80 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నాలుగు ఆర్మ్‌లకు ఉన్న 175 గేట్లను 0.60 మీటర్లు పైకిఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకు నాలుగువేల క్యూసెక్కులు పశ్చిమ డెల్టాకు బుధవారం సాయంత్రం నుంచి నాలుగు వేల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 693 క్యూసెక్కులు, జీఅండ్‌వీకి 272, నరసాపురం కాలువకుS 1,534, ఉండి కాలువకు 890, అత్తిలి కాలువకు 528 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. -
పక్కా ప్లాన్‌తోనే అప్రూవల్
నీటిపారుదల శాఖ భూమిపై వివాదం లోకాయుక్త, హైకోర్టుల్లో కేసులు అయినా భవన నిర్మాణానికి అనుమతినిచ్చిన ధవళేశ్వరం పంచాయతీ కార్యదర్శి అధికారులకు, అధికార పార్టీ నాయకులకు భారీ మొత్తంలో నజరానాలే కారణం! రాజమండ్రి రూరల్/ధవళేశ్వరం, న్యూస్‌లైన్ : ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ఆ భూమి.. నీటిపారుదల శాఖకు చెందిందా లేక ప్రైవేట్ వ్యక్తులదా అన్న దానికి సంబంధించిన వివాదాలు ప్రస్తుతం లోకాయుక్తలో, హైకోర్టులో ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన నిజమే.. అయినా నిబంధనలను నీరుగారుస్తూ.. ఆ భూమిలోని రెండు ప్లాట్లలో మూడు భవనాల గ్రౌండ్ ఫ్లోర్ల నిర్మాణానికి నిస్సంకోచంగా ప్లాన్ అప్రూవల్ ఇచ్చేశారు. అధికారులకు, అధికార పార్టీ నాయకులకు పెద్దమొత్తంలో ముడుపులను మంచినీళ్ల ప్రాయంలా వెదజల్లడమే ఇందుకు కారణమన్న ఆరోపణ ప్రబలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 326లో నీటిపారుదల శాఖకు చెందిన 5.90 ఎకరాల భూమి ఉంది. ఇందులో గట్టి గోపాలరావు అనే వ్యక్తికి 1962లో 2.90 ఎకరాలు, ఉల్లి వెంకట సుబ్బారావు అనే వ్యక్తికి 1968లో 3 ఎకరాలు లీజుకిచ్చారు. 1989 వరకూ లీజు పొడిగించినట్టు నీటిపారుదల శాఖ అధికారుల వద్ద రికార్డులున్నాయి. అయితే నాటి నుంచి లీజు పొడిగించినట్టు ఎక్కడా నమోదు కాలేదు. వెంకట సుబ్బారావుకు గతంలో లీజుకు ఇచ్చిన భూమి అధికార పార్టీ నాయకుల అండదండలతో రియల్టర్ల పరమైంది. లీజు కాలం పూర్తయినా నీటిపారుదల శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోకపోవడంతో అంతకు ముందు వెంకట సుబ్బారావుకు లీజుకిచ్చిన మూడు ఎకరాలలోకి సింగంశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి కౌలుదారుడిగా ప్రవేశించాడు. అధికార పార్టీ నేతల సహకారంతో సత్యనారాయణ, వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు కలిసి ఆ భూమిని లే అవుట్‌గా చేసి ప్లాట్లు వేశారు. అంతేకాక కడియం సబ్ రిజిస్ట్రార్ ఒకే రోజు 44 రిజిస్ట్రేషన్లు చేయడం కూడా అప్పటిలో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నీటిపారుదల శాఖ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి, లే అవుట్ వేసిన విషయమై సమగ్ర విచారణ జరిపించాలని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి అని నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు గానీ, రిజిస్ట్రార్ గానీ కౌంటర్ దాఖలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం బేఖాతరు లే అవుట్లో బినామీలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్లాట్ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించి 1908 నుంచి అది పట్టా భూమి అని, నీటిపారుదల శా స్థలం కాదని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు జరుపుకొనేందుకు వీలుగా స్టే తెచ్చుకున్నారు. అనంతరం అధికార పార్టీ నాయకుల అండదండలతో పాటు పంచాయతీ అధికారులపై ఒత్తిడి తేవడంతో పాటు భారీగా ముడుపులు అందించి.. ఆ వివాదాస్పద భూమిలో నిర్మాణాలకు అనుమతి కూడా పొందారు. ధవళేశ్వరం పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి కృష్ణ గ్రామ ప్రత్యేకాధికారి అయిన రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ సుభాషిణికి తెలియకుండానే 29, 30 నంబరు ప్లాట్లలో వల్లూరి తాతబ్బాయి చౌదరి, వల్లూరి సత్యనారాయణల పేరున మూడు భవనాల గ్రౌండ్ ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేశారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం అని, వివాదం కోర్టులో ఉందని తెలిసినా కార్యదర్శి భవన నిర్మాణపు ప్లాన్‌కు అనుమతి ఇవ్వడం పథకం పక్కా పథకం ప్రకారం పెద్ద తలకాయలే జరిపించాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ స్థలంలో లే అవుట్ వేసి విక్రయించినా అది ప్రభుత్వానికి చెందినదేనంటూ ఒక స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పంచాయతీ కార్యదర్శిపై కేసు పెడతాం.. కాగా తమ శాఖకు చెందిన స్థలంలో అక్రమంగా లే అవుట్ వేసిన వ్యవహారంపై కోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉందని నీటిపారుదల శాఖ ఎస్ఈ కాశీ విశ్వేశ్వరరావు చెప్పారు. అలాంటప్పుడు పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా ప్లాన్ అప్రూవల్ ఇస్తారని ప్రశ్నించారు. ఆయనపై కేసు వేయడంతో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.