ట్రెడ్మిల్ చేస్తూ ఫేస్బుక్ సీవోవో భర్త మరణం
మెక్సికో: ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ష్రేల్ సాండ్బర్గ్ భర్త డేవిడ్ గోల్డ్బర్గ్ ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తూ.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ట్రెడ్మిల్ పై నుంచి అదుపుతప్పి కింద పడి తలకు తీవ్ర గాయం కావడంతో శుక్రవారం చనిపోయినట్టు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి పసిఫిక్ తీరంలో పుంటా మిటా రిసార్ట్ కు విహార యాత్రకు వెళ్లిన ఆయన దుర్మరణం పాలవ్వడం విషాదాన్ని నింపింది. మెక్సికో అధికారుల సమాచారం ప్రకారం 47 ఏళ్ల గోల్డ్బర్గ్ వ్యాయామానికని వెళ్లి ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు ఆరా తీశారు. హెటల్లోని జిమ్‌లో ట్రెడ్మిల్ పక్కన రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న గోల్డ్‌బర్గ్‌ను గమనించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను చనిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై సంఘటన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. గోల్డ్బర్గ్ చాలా మంచి మనిషి... ఆయనతో పరిచయం తన అదృష్టమంటూ సాండ్బర్గ్కు తన సంతాపాన్ని తెలియజేశారు.
కాగా 'సర్వే మంకీ' అనే ఆన్లైన్ సర్వే సంస్థకు సీఈవో గా పనిచేస్తున్న డేవిడ్ గోల్డ్బర్గ్ 2011లో సాండ్బర్గ్ని వివాహం చేసుకున్నారు. గోల్డ్బర్గ్ అకాలమరణంపై సంస్థ ఉద్యోగులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భర్త మరణం తనకు తీరని లోటని.. తన కెరీర్లో ఎదగడం వెనుక తన భర్త పాత్ర చాలా ఉందని... తను నిజమైన భాగస్వామి అంటూ నివాళులర్పించారు సాండ్బర్గ్.
గతంలో ట్రెడ్మిల్ కారణంగా గాయపడిన, అవయవాలను కోల్పోయిన లేదా చనిపోయిన ఘటనలు చాలానే నమోదు అయినట్టు సమాచారం. 2009లో మైక్ టైసన్ నాలుగేళ్ల కూతురు ట్రెడ్మిల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పెద్ద చర్చనీయాంశమైంది. తాజా పరిణామంతో ట్రెడ్మిల్ ఉపయోగాలు, దాన్ని ఉపయోగించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.