మతం పేరిట మహిళలను అలా.. ఎలా?
ఖత్నా ఆచారం.. మహిళా జననాంగ విరూపణం (FGM)పై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతం పేరిట మహిళలను భౌతికంగా హింసించటం ఖచ్ఛితంగా నేరమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఖత్నాకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరగ్గా.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పలు వ్యాఖ్యలు చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: ‘మత సంప్రదాయం పేరిట మహిళల మర్మాంగాలను తాకటం ఏంటి? వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం ఏంటి?.. ఇది ముమ్మాటికీ వారిని భౌతికంగా హింసించటమే. మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లే అవుతుంది. పోక్సో చట్టం ప్రకారం ఆడపిల్లలపై ఈ ఆచారం ప్రయోగించటం లైంగిక నేరం కిందకి వస్తుంది. ఇది ముమ్మాటికీ తీవ్రమైన నేరమే’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది.
వాదనలు సాగాయిలా... ఖత్నా పేరిట మహిళలపై హింస కొనసాగుతోందని పిటిషనర్ సునీతా తివారీ తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఈ వాదనలతో బెంచ్ ఏకీభవించింది. ఆపై దావూదీ బోహ్రా(ఖత్నాను పాటిస్తున్న ముస్లిం సమాజం) తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘వేల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం పాటిస్తూ వస్తున్నారని, దీనికి రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా ఉందని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్, నిఖా హలాల, బహుభార్యత్వం(పాలీగమీ) అంశాల రాజ్యాంగ బద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ వ్యవహారాన్ని బదిలీ చేయాలని’ సింఘ్వీ బెంచ్‌ను కోరారు.
సింఘ్వీ వాదనలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తప్పబట్టారు. ‘మగవాళ్లలో సున్తీ ప్రక్రియ కొన్ని ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తాయన్న వాదన ఉంది. కానీ, మహిళల విషయానికొస్తే ఇది చాలా తీవ్రమైన అంశం. వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కుల ప్రకారం ఇది ఖచ్ఛితంగా నిషేధించాల్సిన అంశం. అంతర్జాతీయ సమాజం ఈ ఆచారాన్ని ముక్తకంఠంతో ఖండించింది. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, 27 ఆఫ్రికన్ దేశాలు ఖత్నాను నిషేధించాయి కూడా’ అని బెంచ్‌కు ఏజీ విన్నవించారు. ఇరువర్గాల వాదనలను విన్న బెంచ్.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది.
ఖత్నా గురించి... సాధారణంగా ఇస్లాంలో సున్తీ పురుషులకు చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో మహిళలపై కూడా ఈ ఆచారాన్ని అమలు చేస్తున్నారు. అదే ఖత్నా.. దీనినే స్త్రీ సున్తీ మరియు స్త్రీ జననేంద్రియ కట్టడం అని కూడా పిలుస్తారు. ఇది బాహ్య మహిళ జననేంద్రియాల యొక్క మొత్తం లేదా అన్నింటిని తొలగించే ప్రక్రియ(మహిళల జననేంద్రియంలో క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం). ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పసుపు, వేడి నీళ్లు, సాధారణ పైపూత మందును వాడుతారు. ఆంగ్లంలో 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా దీన్ని వ్యవహరిస్తున్నారు.
భారత్ విషయానికొస్తే... బొహ్రా ముస్లిం సమాజం (దావూదీ బొహ్రా, సులైమానీ బొహ్రా)లో ఇది సర్వ సాధారణం.గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బొహ్రా ముస్లింలు ఎక్కువ. దేశంలో వీరి జనాభా దాదాపు 10 లక్షల దాకా ఉంటుంది. అయితే దావూదీ బొహ్రా ముస్లింలు దేశంలోని విద్యావంతమైన ముస్లిం సమాజాల్లో ఒకటి. అయినప్పటికీ ఆ ఆచారాన్ని పాటిస్తుండటం గమనార్హం. తొలుత పరిశుద్ధత పేరిట వాదనను వినిపించిన ఆ వర్గం.. ఆ తర్వాత క్లైటోరిస్ ఉండడం వల్ల అమ్మాయిల్లో లైంగికవాంఛ పెరుగుతుందని, అందుకే దీనిని ఆచరిస్తున్నామని చెబుతుండటం గమనార్హం. అయితే ఆడపిల్లల్ని శారీరకంగా హింసించే ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతుండగా.. గతేడాది సునీతా తివారీ అనే ఉద్యమవేత్త సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఐరాస నిషేధం... మరోవైపు ''స్త్రీ జననేంద్రియంలో వెలుపలి భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని ఎఫ్‌జీఎంగా వ్యవహరించాలి'' అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది. ఈ విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి పరిగణించింది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌జీఎం పద్ధతికి ముగింపు పలుకుతూ, 2012 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై 194 దేశాలు(భారత్ సహా) సంతకం చేశాయి. ఆ తర్వాత కొన్ని దేశాలు ఎఫ్‌జీఎంను నిషేధిస్తూ చట్టాలు చేసుకోగా.. భారత్ మాత్రం చట్టం చేయలేదు. ఎఫ్‌జీఎంను నిర్మూలించేందుకు, దీనిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతి యేటా ఫిబ్రవరి 6ను 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టోలరన్స్ ఫర్ ఎఫ్‌జీఎం'గా జరుపుకోవాలని ఐరాస ప్రకటించింది కూడా.