టెక్నాలజీతో దోస్తీ
టెక్నాలజీతో దోస్తీ కట్టిన ప్రపంచంలో కంప్యూటర్ కామన్ నీడ్‌గా మారిపోయింది. ఆధునికతను అందిపుచ్చుకోవడంలో కాస్త అటుఇటుగా ఉన్నవాళ్లూ ఇప్పుడు కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్నారు. డే టు డే లైఫ్‌లో కంప్యూటర్‌తో ఇంత రిలేషన్ ఉన్నా... దాన్ని సరిగా మెయింటెయిన్ చేయరు. అందుకే ఏడాదికి ఒక్కసారైనా కంప్యూటర్ శుభ్రపరచాలనే ఉద్దేశంతో ఏటా ఫిబ్రవరి రెండో సోమవారాన్ని ‘క్లీన్ అవుట్ యువర్ కంప్యూటర్ డే’గా వ్యవహరిస్తున్నారు. లెట్స్ క్లీనప్ యువర్ సిస్టమ్...
- త్రిగుళ్ల నాగరాజు
కంప్యూటర్ను క్లీన్ చేయడమంటే తడిబట్టతో తెగ తుడిచేయడం కాదు. మన సిస్టమ్ ఫేస్ చేస్తున్న సమస్యలను పరిష్కరించడం. కంప్యూటర్లో పాడైపోయిన డివైజ్‌లను మార్చుకోవడం లేదంటే అప్‌గ్రేడ్ చేయడం. ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న సమస్యలను క్లియర్ చేసుకోవాలి. డేటా మెయింటెనెన్స్ పక్కాగా ఉండాలి. అనవసరమైన ఫైల్స్, డేటాతో హార్డ్ డిస్క్‌పై భారం వేయకుండా.. ఎప్పటికప్పుడు వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. ఆ సమాచారం మీకు ఇంకెప్పుడైనా అవసరం అవుతుందని అనిపిస్తే.. డేటా బ్యాకప్ తీసుకోండి. అంతేకానీ.. హార్డ్‌డిస్క్‌లో పార్టిషన్స్ అన్నీ నింపేసి పరేషాన్ కాకండి. ఇవన్నీ క్లీనింగ్‌లో భాగమే. ఇలా సిస్టమ్ క్లీనప్ చేయడం ద్వారా.. కంప్యూటర్ వేగం పెరగడం మాత్రమే కాదు, లైఫ్‌టైమ్ కూడా పెరుగుతుంది.
చేయి తగలకుండా...
టెక్నికల్‌గా సిస్టమ్ మెయింటెయిన్ చేయడం ఎంత ఇంపార్టెంటో.. ఫిజికల్‌గా నిర్వహించడమూ అంతే ముఖ్యం. మూడు నెలలకోసారైనా...సిస్టమ్ సీపీయూ ఓపెన్ చేసి లోపల పేరుకుపోయిన దుమ్మును బ్రష్‌తో శుభ్రం చేయండి. బ్లోయర్ ఉంటే మరీ మంచిది. టేబుల్ ఫ్యాన్ ముందు సీపీయూ టాప్ ఓపెన్ చేసి పెట్టండి.. ఐదు నిమిషాల్లో.. మూలమూలలో ఉన్న దుమ్మంతా కొట్టుకుపోతుంది. సీపీయూ క్లీన్ చేసే టైమ్‌లో అందులోని ఏ భాగానికీ తడి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇన్నర్ క్లీనింగ్ పూర్తయ్యాక.. సీపీయూ బాడీ, మౌస్, కీబోర్డ్, మానిటర్.. పొడిబట్టతో శుభ్రం చేస్తే సరిపోతుంది.
డిలీట్.. అప్‌గ్రేడ్
ఓ రెండు గంటలు కష్టపడి సిస్టమ్‌ను క్లీన్ చేసుకుంటే.. నాలుగైదు నెలల వరకూ మళ్లీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. ముందుగా సీ డ్రైవ్‌లో నుంచి TMP, CHK.. ఫైల్స్‌ను డిలీట్ చేయాలి. తర్వాత సిస్టమ్‌లో అవసరం లేదనుకున్న డేటాను డిలీట్ చేసేయండి. మిగిలిన డేటాను సిస్టమాటిక్‌గా అమర్చుకోండి. ఇప్పుడు ఇంటెర్నెట్ ద్వారా యాంటీవైరస్‌ను అప్డేట్ చేసుకుని సిస్టమ్ స్కాన్ చేయండి. పూర్తయ్యాక రీస్టార్ట్ చేయండి. తర్వాత సీ డ్రైవ్‌ను డీఫ్రాగ్మెంట్ (Start> programs Files> Accessories > System Tool> Disk Defragmentation) చేయండి. మీరు ఉపయోగించే అన్ని సాఫ్ట్వేర్లను ఇంటర్నెట్ సాయంతో అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే.. మీ కంప్యూటర్‌కు కొత్త లైఫ్ ఇచ్చినట్టే.
- సురేశ్ వెలుగూరి, గ్రీన్ కంప్యూటింగ్ యాక్టివిస్ట్
computergreen@gmail.com