ఆంక్షలపై ఆగని ఆందోళనలు
* మూడు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతులు
* షర తుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్
నిజామాబాద్/ఆదిలాబాద్/కరీంనగర్, న్యూస్‌లైన్: రుణ మాఫీపై ఆంక్షలను నిరసిస్తూ శుక్రవారం కూడా రైతులు ఆందోళనలు చేపట్టారు. షరతులు లేకుండా పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రాస్తారోకో, ధర్నాలు చేశారు. రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. పలుచోట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, పెర్కిట్ శివారులో రైతులు రోడ్డుపై బైఠాయించారు. నందిపేట, కామారెడ్డి, సదాశివనగర్ మండలం లింగంపేటలలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఖోడథ్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును రైతులు ఘెరావ్ చేశారు. దండేపల్లి మండలం ముత్యంపేటలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో రైతులు ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ వాహనాన్ని అడ్డుకుని.. ఘెరావ్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు, కథలాపూర్ మండలం చింతకుంటలో రైతులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు నిప్పంటిం చారు. కాగా రుణాల మాఫీ ఆంక్షలపై మనస్థాపం చెంది మెదక్‌జిల్లా జహిరాబాద్ మండలం ఖాశీంపూర్కు చెందిన దత్తాత్రి (55), అలాగే కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం మాదాపూర్‌కు చెందిన స్వామిరెడ్డి(50)లు గుండెపోటుతో మరణించారు.