మోగిన ఉప ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: మెహ్రోలీ, కృష్ణానగర్, తుగ్లకాబాద్ శాసనసభ నియోజకవర్గాలకు వచ్చే నెల 25న ఉప ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలతోపాటు ఢిల్లీలోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ శనివారం ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 28న వెలువడనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23న జరుగుతుంది. నామినేషన్లను వచ్చే నెల ఐదో తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏడున నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. పదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 29న ముగుస్తుందని ఈసీ ప్రకటించింది. మెహ్రోలీ, కృష్ణానగర్, తుగ్లకాబాద్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ప్రవేశ్వర్మ, హర్షవర్ధన్, రమేష్ బిధూడీ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో వారంతా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా ఇవ్వడంతో ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. అయితే శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరుపుతారని అంతా ఆశిస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్....ఉప ఎన్నికల ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు ఇప్పట్లో జరగకపోవచ్చనికొందరు రాజకీయ పండితులు అంటున్నారు. మరికొందరు మాత్రం ఉప ఎన్నికల ప్రకటన కు, అసెంబ్లీ రద్దుకు సంబంధం లేదని అంటున్నారు. శాసనసభ ఎన్నికలు జరిపించే అవకాశాలు ఉన్నాయని వార ంటున్నారు.
లోక్సభ ఎంపీలుగా మారిన ముగ్గురు ఎంపీలూ... శాసనసభకు మే నెలాఖరున రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నికలు నిర్వహిం చాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రకటన నెలరోజుల ముందుగా చేయాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల కారణాల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఉప ఎన్నికల ప్రకటన చేసిందని వారంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక శాసనసభను రద్దు చేస్తారా ? అనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అందువల్ల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కేంద్రం ఇచ్చే జవాబుపై ఆధారపడి ఉంటుందని వార ంటున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఢిల్లీ శాసనసభ భవితవ్యం తేలే రోజునే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.