క్రేజీ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి వచ్చీరాగానే మహామహా పార్టీలను మట్టికరిపించి ఢిల్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న 45 ఏళ్ల అరవింద్ కేజ్రీవాల్ అంతేవేగంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన ఐఆర్ఎస్ పదవి వదులుకుని సమాచారహక్కు చట్టం అమలు కోసం పోరాటం చేశారు. 2011లో అన్నాహజారే చేపట్టిన జన్‌లోక్‌పాల్ ఉద్యమంలో చేరి కీలకపాత్ర పోషించారు.
దీంతో కేజ్రీవాల్ పేరు దేశంలో మార్మోగింది. కేజ్రీవాల్ హజారేతో విభేదాలు తలెత్తాక, అవినీతి నిర్మూలిస్తానంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆప్ సంచలన విజయంతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. జన్‌లోక్‌పాల్ బిల్లు వ్యవహారంలో మాట నెగ్గించుకోలేక పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన జీవిత విశేషాలివీ..
జననం: 1968, ఆగస్టు 16న హర్యానాలోని హిస్సార్‌లో; భార్య: సునీతా కేజ్రీవాల్ (ఐఆర్ఎస్ అధికారి); విద్య: హిస్సార్ క్యాంపస్ స్కూల్, ఐఐటీ ఖరగ్‌పూర్ (మెకానికల్ ఇంజనీరింగ్); 1989-92: టాటా స్టీల్‌లో ఉద్యోగం; 1995: ఐఆర్ఎస్లో చేరిక; 2000: ఉన్నత విద్య కోసం రెండేళ్ల పాటు ఆర్జిత సెలవు.. మూడేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగంలోకి; 2006: ఢిల్లీలోని ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ పదవికి రాజీనామా. ఆర్టీఐ ఉద్యమానికి గుర్తింపుగా రామన్ మెగసెసె అవార్డు; 2012: నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రారంభం; 2013 డిసెంబర్ 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భా వం. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం షీలా దీక్షిత్‌పై 26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు; డిసెంబర్ 28: కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు. సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం; 2014 ఫిబ్రవరి 14: సీఎం పదవికి రాజీనామా.