అక్కడ టీమిండియాకు ఎదురేలేదు!
ఢిల్లీ: భారత్-న్యూజిలాండ్‌ల రెండో వన్డేకు ఆతిథ్యమిచ్చేందుకు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఈ మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. భారత్ ఘనవిజయాలెన్నింటికో ఈ వేదిక సాక్షిగా నిలిచింది. గత పదకొండేళ్లుగా ఈ వేదికపై వన్డే క్రికెట్లో భారత్‌కు ఓటమి లేకపోవడం విశేషం. భారత్ వరుసగా గత ఆరు వన్డేల్లో విజయం సాధించింది. కాగా 2009లో పిచ్ ప్రమాదకరంగా మారడంతో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఈ స్టేడియంలో భారత్ చివరి వన్డే 2014 అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ఆడింది.
1999లో పాకిస్థాన్‌తో ఈ వేదికపై జరిగిన టెస్టులో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే చరిత్రాత్మక 10 వికెట్ల రికార్డు నెలకొల్పాడు. ఈ వేదికలో ఇప్పటి వరకు 33 టెస్టులు, 23 వన్డేలు, నాలుగు టి-20 మ్యాచ్‌లు జరిగాయి.