118 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో మహిళలు నడిపే టాక్సీల సంఖ్య పెరుగనుంది. ట్యాక్సీలో మహిళపై అత్యాచార ఘటన నేపథ్యంలో నగరంలో మహిళా క్యాబ్‌ల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ఢిల్లీ పోలీసులు ట్యాక్సీలు నడపడంలో మహిళలు శిక్షణ ఇప్పించి లెసైన్స్‌లు అందించాలని నిర్ణయించారు. ఆయా కాలనీల్లో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణపై అవగాహన కల్పించారు. ఇందుకు మహిళల నుంచి ఆశించిన స్పందన లభించింది. డ్రైవింగ్‌లో శిక్షణ పొందడానికి పేరు నమోదు చేసుకోవడం కోసం సోమవారం ఒక్కరోజే 143 మంది మహిళలు వచ్చారని అదనపు డీసీపీ విజేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు. వయసు, సర్టిఫికెట్లు పరిశీలించి 118 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎంపికైన వారికి నిరంకారీ గ్రౌండ్లో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి వాణిజ్యపరమైన లెసైన్స్ అందచేయనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.